ముంపు పరిహారం తర్వాతే పనులు
బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి
సాక్షి, నిర్మల్: ముంపు రైతులకు పరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టుల పనులు చేపట్టాలని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన దిలావర్‌పూర్ మండలం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాణహిత–చేవెళ్ల కెనాల్, మామడ మండలం పొన్కల్ వద్ద సదర్‌మాట్ బ్యారేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముంపునకు గురవుతున్న రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకంగా కాదని, అయితే రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కువాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయంగా పరిహారం ఇవ్వని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. రజాకారుల జమానాను కేసీఆర్ పాలన తలపిస్తుందన్నారు. అంతకు ముందు ఆయన బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని చూడడం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 136 మండలాల్లో కరువు ఉందని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రెగ్యులరైజేషన్‌పై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట గోదావరి, కృష్ణాజలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు ఉన్నారు.