ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఎన్నికల సంఘం
Published Sat, Oct 5 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహిస్తామని, ఓట్ల లెక్కింపును 8వ తేదీన ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా తయారీ 100 శాతం పూర్తయిందని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ఢిల్లీ, మిజోరం అసెంబ్లీలకు ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.
నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంపత్ చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించడం కోసం వ్యయ పరిశీలకులను, పోలింగ్ సజావుగా జరపడం కోసం పోల్ పరిశీలకులను నియమించడంతోపాటు ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం అవేర్‌నెస్ అబ్జర్వర్లను తొలిసారిగా నియమించనున్నట్లు ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను మోహరించనున్నామన్నారు.
తొలిసారిగా తిరస్కార ఓటు హక్కు...
సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఆప్షన్ల జాబితాలో నన్ ఆఫ్ ద ఎబౌ(పైవారిలో ఎవరూ కాదు) అనే అవకాశాన్ని కూడా చేర్చనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అంటే అభ్యర్థులలో ఎవరికీ ఓటు వేయడానికి ఇష్టపడనివారు పై వారిలో ‘ఎవరూ కాదు’ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే నన్ ఆప్ ద ఎబౌ అప్షన్‌కు మిగతా అభ్యర్థులందిరి కన్నా ఎక్కువ ఓట్లు పడినట్లయితే ఫలితం ఎలా ఉంటుందనేది ఎన్నికల కమిషన్ స్పష్టం చేయలేదు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలో ఏకాలంను ఖాళీగా వదలరాదని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాన్ని కూడా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలలో అమలుచేయనుంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు ఏ కాలంను ఖాళీగా వదల కుండా చూసుకోవాలి. ఏ కాలాన్నైనా ఖాళీగా వదిలినట్లయితే వారి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గువుతాయి.
Advertisement
Advertisement