రాజధాని నగరంలోని అనధికార కాలనీలవాసులకు శుభవార్త. నగరంలో 1,200కు పైగానున్న అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు
న్యూఢిల్లీ:రాజధాని నగరంలోని అనధికార కాలనీలవాసులకు శుభవార్త. నగరంలో 1,200కు పైగానున్న అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ఢిల్లీలో అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియను అతిత్వరలో ప్రారంభిస్తామని తెలిపింది. జాతీయ గృహ నిర్మాణ ప్రణాళిక రూపకల్పన చివరి దశలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ ప్రణాళిక కింద మురికివాడల పునరావాసానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, అందరికీ గృహ వసతి కల్పించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని, ఈ విషయాన్ని తమ ప్రభుత్వం క్రియాశీలకంగా పరిశీలిస్తోందని చెప్పారు.
ఢిల్లీలోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరి అంకంలో ఉందని అన్నారు. ఈ కాలనీల్లో నివసిస్తున్న వారికి విద్యుత్, నీరు, ఇతర సదుపాయాలు అందుతున్నాయని, అయితే రికార్డుల్లో మాత్రం అవి అనధికార కాలనీలుగానే ఉన్నాయని చెప్పారు. కాలనీవాసులు తమ ఆస్తులను ఇతరులకు బదలాయించలేకపోతున్నారని, ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఏ రోజైనా, ఏ క్షణంలోనైనా అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తామని వెంకయ్య చెప్పారు. జాతీయ రాజధాని ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండో సవరణ బిల్లు, 2014పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ చట్టం ద్వారా ఢిల్లీలోని అనధికార కాలనీల్లో కూల్చివతేలను మూడేళ్లపాటు వాయిదా వేయవచ్చు.
నేడు దేశంలో ప్రతి ఒక్కరికి గృహ వసతి కల్పించడం అతిపెద్ద సవాలు అని వెంకయ్య పేర్కొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గృహ పథకాలను అధ్యయనం చేశామని అన్నారు. జాతీయ గృహ నిర్మాణ ప్రణాళికను రూపొందించే ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పారు. ‘అందరికీ గృహ వసతి’ ప్రణాళికను రూపొందించే ముందు వివిధ నగరాలలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
క్రమబద్ధీకరణపై ఐక్యమైన అధికార, విపక్షాలు
మత మార్పిడుల అంశంపై గత వారం పది రోజులుగా పరస్పరం కటువుగా వ్యవహరించిన అధికార, ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో అనధికార కాలనీల క్రమబద్ధీకరణ బిల్లు విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. మురికివాడల్లోని పేదలకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లును ఆమోదించేందుకు అందరూ చేతులు కలిపారు. ‘‘ఈ బిల్లుపై పూర్తిస్థాయి చర్చ అవసరం లేదు. ఎందుకంటే దేశమంతటి నుంచి వచ్చే పేదలకు సంబంధించిన అంశం ఇది. వారి ఇళ్లు చెక్కుచెదరకుండా ఉండాలి. ఈ బిల్లుకు మేము మద్దతునిస్తున్నాం’’ అని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలో ఓ కూల్చివేతను అడ్డుకున్నారని ఆజాద్ గుర్తు చేశారు. ఈ శీతాకాలంలో పేదల ఇళ్లను కూల్చివేయకూడదని చెప్పారు.
మత మార్పిడుల అంశంపై ప్రధాని సమాధానం ఇవ్వాలంటూ గత వారం రోజులుగా రాజ్యసభను స్తంభింప చేసిన విపక్షాలు శీతాకాలం సమావేశాలు శుభకరంగా ముగియాలని ఆశించారు. అందుకనుగుణంగానే పేదలకు అనుకూలమైన ఓ బిల్లును ఆమోదించినందుకు ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. ఈ బిల్లు వల్ల నగరంలోని 60లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రియన్ అన్నారు. అయితే ఇది క్రిస్మస్ లేదా నూతన సంవత్సర బహుమానం కాదని, అది వారి హక్కు అని అన్నారు. ఈ బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ వరకు నగరంలో వెలసిన అనధికార కాలనీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు.