రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని...
= లాడ్‌ను బర్తరఫ్ చేయాల్సిందే.. : బీజేపీ
= అంతవరకూ ఆందోళన
= త్వరలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోనూ ఆందోళనలు
= ముఖ్యమంత్రికి మతి మరుపు
= వారి పార్టీ నేతల అవినీతిని మరిచిపోయారా?
= లాడ్‌ను తొలగించకుంటే.. సీఎం కూడా ఇంటికే
= సంతోష్‌ను రక్షించేందుకు డబ్బు తీసుకున్నారేమో?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. తొలుత ఫ్రీడం పార్కు నుంచి బయలుదేరిన నాయకులను జేడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ముందుకు సాగడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ సహా పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకు ముందు ఫ్రీడం పార్కులో కార్యకర్తలనుద్దేశించి ప్రహ్లాద జోషి ప్రసంగిస్తూ, సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించేంత వరకు తమ పార్టీ ఆందోళనలు చేస్తూనే ఉంటుందని తెలిపారు.
మున్ముందు తాలూకా, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మతి మరుపు వ్యాధితో బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, బదిలీల్లో జరిగిన అవకతవకలను ఆయన మరిచి పోయినట్లున్నారని అన్నారు. కనుక ఆయన ‘మతి మరుపు భాగ్య యోజన’ను అమలు చేయాలని దెప్పి పొడిచారు.
లాడ్‌ను తొలగించక పోతే, ముఖ్యమంత్రే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప మాట్లాడుతూ సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరలు లాడ్ వద్ద డబ్బులు తీసుకుని ఆయనను రక్షిస్తున్నారనే అనుమానాలు రాష్ర్ట ప్రజల్లో ఉన్నాయని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.