
పట్టణ సమస్యలు పరిష్కరించండి
సీఎంతో భివండీ ప్రముఖుల భేటీ
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎంపీ కపిల్ సిబాల్, మేయర్ ప్రతిభాపాటిల్ కోరారు. ఈ మేరకు వారు ఆదివారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భివండీకి నిత్యం వేల సంఖ్యలో ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ప్రస్తుతం రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే, భివండీ తూర్పు నియోజకవర్గంలో పవర్‌లూమ్ పరిశ్రమపై ఆధారపడి అధిక సంఖ్యలో తెలుగువారు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అందే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ, మేయర్‌తోపాటు భివండీ పడమర ఎమ్మెల్యే మహేష్ చౌగులే, నాయకులు సంతోష్ ఎం శెట్టి, మాజీ మేయర్ విలాస్ పాటిల్ తదితరులు ఉన్నారు.