
కుష్భుకు పదవి దక్కేనా!
మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు నటి కుష్భుకు దక్కనున్నాయన్న ప్రచారంతో రాష్ట్ర పార్టీలోని సీనియర్ మహిళా మణులు కినుకు వహించే పనిలో పడ్డారు.
చెన్నై : మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు నటి కుష్భుకు దక్కనున్నాయన్న ప్రచారంతో రాష్ట్ర పార్టీలోని సీనియర్ మహిళా మణులు కినుకు వహించే పనిలో పడ్డారు. తమను కాదని నిన్నగాక మొన్న వచ్చిన కుష్భుకు ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, ఆ పదవిని చేజిక్కించుకునేందుకు రాహుల్ మద్దతు దారు జ్యోతి మణి తీవ్రంగానే కుస్తీలు పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
డీఎంకేకు టాటా చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నటి కుష్భుకు ఆ పార్టీలో ఆదరణ లభిస్తున్నది. ఆమెను తమ ప్రాంతానికి వచ్చి సభల్లో ప్రసంగించాలని కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌లో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్భుకు ఇంతవరకు ఎలాంటి పదవి కేటాయించలేదు. అదిగో రాజ్య సభ...ఇదిగో అధికార ప్రతినిధి పదవీ అంటూ ప్రచారాలు మాత్రం తెగ సాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కుష్భుకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని కేటాయించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
పదవి దక్కేనా : అన్నాడీఎంకేలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత మహిళా గ్లామర్. ఇక, డీఎంకేలో మహిళా విభాగం గ్లామర్‌గా కరుణానిధి గారాల పట్టి కనిమొళి రంగంలోకి దిగారు. డీఎండీకేలో విజయకాంత్ సతీమణి ప్రేమలత మహిళా గ్లామర్. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌కే సర్వాధికారం. ఇలా మహిళా గ్లామర్, వాక్ ధాటితో ఆయా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా తాము సైతం బలోపేతం కావాలన్న లక్ష్యంతో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కుస్తీలు పడుతున్నారు.
తమకు సినీ గ్లామర్‌గా దక్కిన కుష్భును పూర్తి స్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకోవాలన్న కాంక్షతో ఆయన పావులు కదుపుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట దలచిన నిరసనకు తిరుచ్చి జిల్లా బాధ్యతల్ని కుష్భు భుజాన వేశారు. అయితే, ఆమెకు పార్టీ పరంగా ఎలాంటి పదవీ లేని దృష్ట్యా, మహిళా విభాగం అధ్యక్ష పగ్గాల్ని ఆమెకు అప్పగించే రీతిలో అధిష్టానంకు సిఫారసు చేసినట్టు సమాచారం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో ప్రజల్ని ఆకర్షించేంత గ్లామర్ ఎవరికీ లేని దృష్ట్యా, ఆ కొరతను కుష్భు ద్వారా భర్తి చేయడానికి అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
రేసులో జ్యోతిమణి: గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో అడ్డంకుల్ని అధిగమించి కుష్భు పదవి చేజిక్కించుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు కారణంగా కుష్భుకు మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించబోతున్నారన్న సమాచారంతో రేసులో మరికొందరు దిగారు. పార్టీకి ఏళ్ల తరబడి సేవల్ని అందిస్తున్న తమను పక్కన పెట్టి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కుష్భుకు ఆ పదవి ఎలా ఇస్తారని పెదవి విప్పే వాళ్లు బయలు దేరారు. మరి కొందరు సీనియర్ మహిళా నాయకులు అయితే కినుకు వహించే పనిలో పడ్డారు.
ఇంకొందరు అయితే, తమ బలాన్ని చాటుకునే రీతిలో ఆ పదవి చేజిక్కించుకునేందుకు అధిష్టానం మీద ఒత్తిడికి సిద్ధం అయ్యారు. వీరిలో జ్యోతిమణి ప్రథమంగా రేసులో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు గల నాయకురాలిగా ఆమెకు రాష్ట్రంలో పేరు ఉంది. అలాగే, జాతీయ స్థాయిలో యువజన విభాగంలో పదవిని సైతం ఆమెకు కట్టబెట్టి ఉన్నారు.
తన మాతృ రాష్ట్రంలో సేవల్ని విస్తృతం చేసుకునేందుకు ఆమె కూడా మహిళా పదవి లక్ష్యంగా రాహుల్ ద్వారా ఒత్తిడికి రెడీ అవుతున్నట్టు టీఎన్‌సీసీలో చర్చ సాగుతుండడం గమనార్హం. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా సీనియర్లుగా ఉన్న యశోధ, ఎమ్మెల్యే విజయ ధరణి, రాణి వెంకటేషన్, హసినా సయ్యద్ సైతం ఆ పదవి కోసం తమ తమ మార్గాల్లో అధిష్టానం మన్ననలను అందుకునేందుకు ఉరకలు పరుగులు తీస్తుండడంతో మహిళా పదవి కుష్భును వరించేనా లేదా, ఆమె మరికొన్నాళ్లు ఎలాంటి పదవీ లేకుండా కాంగ్రెస్‌కు సేవలు అందించేనా...? అన్నది వేచి చూడాల్సిందే.