ఆగ్రాను తాకకుండా తాజ్‌మహల్‌కు.. | to reach tajmahal no need to go agra | Sakshi
Sakshi News home page

ఆగ్రాను తాకకుండా తాజ్‌మహల్‌కు..

Published Wed, Mar 5 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

ఆగ్రాను తాకకుండా తాజ్‌మహల్‌కు..

ఆగ్రాను తాకకుండా తాజ్‌మహల్‌కు..

కాన్పూర్, ఢిల్లీ నుంచి వచ్చే పర్యాటకులు ఇకపై తాజ్‌హమల్ చూడడానికి వెళ్లాలంటే నిత్యం రద్దీగా ఉండే ఆగ్రా పట్టణంలో నుంచి వెళ్లనక్కరలేదు.

 సుసాధ్యం చేయనున్న ఇన్నర్ సిటీ రింగ్‌రోడ్డు
 యమునా ఎక్స్‌ప్రెస్ హైవే-ఫతేహాబాద్ టూరిజం
   కాంప్లెక్స్‌ను కలుపుతూ నిర్మాణం
 ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అఖిలేశ్ యాదవ్
 తాజ్‌గంజ్ సుందరీకరణ ప్రాజెక్టు పనులకు కూడా...

 
 న్యూఢిల్లీ: కాన్పూర్, ఢిల్లీ నుంచి వచ్చే పర్యాటకులు ఇకపై తాజ్‌మహల్ చూడడానికి వెళ్లాలంటే నిత్యం రద్దీగా ఉండే ఆగ్రా పట్టణంలో నుంచి వెళ్లనక్కరలేదు. ఎందుకంటే త్వరలో అందుబాటులోకి రానున్న ఇన్నర్ సిటీ రింగ్‌రోడ్డు ఆగ్రా పట్టణంతో సంబంధం లేకుండానే పర్యాటకులను తాజ్‌మహల్ ముంగిట్లోకి తీసుకెళ్లనుంది. యమునా ఎక్స్‌ప్రెస్ హైవే- ఫతేహాబాద్ టూరిజం కాంప్లెక్స్‌ను కలిపే ఈ రింగ్‌రోడ్డు తాజ్‌మహల్‌కు అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. రూ. 306 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ రూ. 108 కోట్లతో తాజ్‌గంజ్ సుందరీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రింగ్‌రోడ్డు నిర్మాణ పనుల కాంట్రాక్టును జైపూర్ కంపెనీకి అప్పగించినట్లు ఆగ్రా అభివృద్ధి సంస్థ(ఏడీఏ) కార్యదర్శి రవీంద్రకుమార్ తెలిపారు. త్వరలో భూమిపూజ  చేసి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మార్గానికి సమాంతరంగా మరో రెండు లేన్లను కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
 
  మొదటి ఫేజ్‌లో భాగంగా ఆరులేన్లతో 10.9 కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ రహదారిని ఆనుకొని అనేక పారిశ్రామిక సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశముందన్నారు. ఇప్పటికే ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని,  యమునా ఎక్స్‌ప్రెస్‌వే-ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే కుబేర్‌పూర్ దగ్గర కలుస్తాయన్నారు. మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించిన తర్వాత ఈ మారాన్ని ఫతేహబాద్‌కు కలపాలని స్థానికుల నుంచి డిమాండ్లు పెరగడంతోనే రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇది తాజ్‌మహల్‌కు అత్యంత సమీపం నుంచే వెళ్లనుండడంతో పర్యాటకులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్లవచ్చని చెప్పారు. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశముందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement