- అభివృద్ధి పనులు ప్రారంభం
- రూ. ఐదు కోట్లతో అత్యాధునికంగా నవీకరణ
- పనులు ప్రారంభించిన కట్టె పేరు మార్చాలని మనవి
బెంగళూరు : నగరంలో ప్రసిద్ది చెందిన పుట్టణ్ణచెట్టి పురభవన (టౌన్‌హాల్) మరమ్మతులకు బుధవారం శ్రీకారం చుట్టారు. రూ. ఐదు కోట్ల వ్యయంతో పురభవనను అత్యాధునికంగా తీర్చిదిద్ది ప్రజలకు అంకితం చేస్తామని బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ అన్నారు. బుధవారం పురభవనలో ప్రత్యేక పూజలు చే సి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నగరంలో ప్రఖ్యాతి గాంచిన కట్టడాలలో పుట్టణ్ణ చెట్టి పురభవనం ఒకటి అని అన్నారు. అనివార్య కారణాల వల్ల, నిధులు లేక ఇంత కాలం ఈ పురభవనం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు. బీబీఎంపీ నిధులతో పనులు చేపట్టామని, త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నగరంలోని ప్రసిద్ధి చెందిన కట్టడాలను తాకట్టు పెట్టినట్లు పాలికెపై ఉన్న చెడ్డపేరును తుడిచి పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
టౌన్‌హాల్ పేరు మార్చండి
బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పుట్టణ్ణశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టణ్ణ శెట్టి మనుమడు విశ్వనాథ్ మాట్లాడుతూ ‘మా తాత పేరు పుట్టణ్ట శెట్టి... అయితే పుట్టణ్ణ చెట్టి అని పెట్టారు. దయచేసి టౌన్‌హాల్‌కు మరోసారి పుట్టణ్ణ శెట్టి పురభవన అని నామకరణం చేయండి’ అని మనవి చేశారు. ఇందుకు మేయర్ అంగీకరించారు.
15 రోజులకు ఒక సారి పనుల పరిశీలన
బీబీఎంపీ వార్డు భారీ పనుల స్థాయీ సంఘం అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ టౌన్‌హాల్ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పనుల పరిశీలనకు 15 రోజులకు ఒకసారి మా స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు వచ్చి వెళుతుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా, పాలన విభాగం నాయకులు అశ్వత్థ నారాయణగౌడ, స్థాయి సంఘం అధ్యక్షులు గౌరమ్మ, రేఖా కదిరేషన్ పాల్గొన్నారు.