
చిక్కిన పులులు
వండలూరు జూ నుంచి జారుకున్న పులులు చిక్కాయి. ఆ జూ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆదివారం నుంచి సందర్శకులను జూలోకి అనుమతిస్తున్నారు.
సాక్షి, చెన్నై: వండలూరు జూ నుంచి జారుకున్న పులులు చిక్కాయి. ఆ జూ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆదివారం నుంచి సందర్శకులను జూలోకి అనుమతిస్తున్నారు. చెన్నై వండలూరు జూ నుంచి పులులు జారుకున్న విషయం తెలిసిందే. జూ నుంచి పులులు తప్పించుకున్న సమాచారం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ఇప్పటికే గత కొంత కాలంగా ఓ పులి సంచరిస్తున్న వ్యవహారంతో ఆందోళనలో ఉన్న ఆ పరిసరవాసుల్లో తాజా ఘటన మరింత ఆందోళనలో పడేసింది. జూలోకి సందర్శకుల అనుమతిని రద్దు చేసిన అధికారులు పులుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. పులుల జాడ కోసం సీసీ కెమెరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడక్కడ మాంసాన్ని ఉంచారు. ఆకలితో వచ్చే ఆ పులులు ఎలాగైనా కెమెరాలకు చిక్కుతాయన్న ఎదురు చూపుల్లో పడ్డారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం నాలుగు పులులు ఆహారం కోసం వచ్చి కెమెరాకు చిక్కాయి. అప్పటికే 30 మందికి పైగా సిబ్బంది అక్కడక్కడ మాటేశారు. వెర్లైస్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఆహారం కోసం వచ్చిన నాలుగు పులులకు ఇంజక్షన్ వేసి మత్తులోకి పంపించారు. వాటిని అక్కడికక్కడే ప్రత్యేక బోనుల్లో ఉంచి భద్రతతో కూడిన ప్రదేశానికి తరలించారు. మూడు పులులలను ఓ బోనులో, మరో పులిని ప్రత్యేక బోనులో ఉంచారు.
ముచ్చెమటలు : నాలుగు పులులు చిక్కినా నేత్ర అనే రెండేళ్ల పులి పిల్ల జాడ మాత్రం కానరాలేదు. దీని కోసం తీవ్రంగా రాత్రంతా శ్రమించారు. ఆదివారం ఉదయాన్నే ఓ చోట ఉంచిన మాంసం తింటూ నేత్ర కెమెరాకు చిక్కింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది నేత్రను బంధించారు. అన్ని పులులూ చిక్కడంతో జూ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. పులుల్ని బంధించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. నాలుగు పులులను మాత్రం ప్రత్యేకంగా బోనుల్లో ఉంచామని, చిన్న పులి నేత్రను మాత్ర సందర్శకుల సందర్శనార్థం వాటికి కేటాయించిన ప్రదేశంలో వదిలినట్లు పేర్కొన్నారు. వర్షం కారణంగా పది అడుగుల గోడ 150 మీటర్ల మేరకు దెబ్బ తినడంతో దానికి మరమ్మతులు చేసే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. ఈ పనులు ముగియడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా, అంత వరకు మిగిలిన పులులను బయటకు వదలబోమని జూ వర్గాలు స్పష్టం చేశాయి. ఉదయాని కల్లా అన్ని పులులను బంధించడంతో ఇక సందర్శకులకు అనుమతి ఇచ్చారు. అయితే, సందర్శకుల తాకిడి అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. వచ్చిన వాళ్లందరూ పులి పిల్ల నేత్రను చూడటానికి ఎగబడేవారే.