ఇక్కడా అంతే!
- నగరంలోని జూలోనూ భద్రత అంతంతే
- తక్కువ ఎత్తులోనే పులుల ఎన్‌క్లోజర్లు
- పైకి ఎక్కుతున్న సందర్శకులు
- పట్టించుకోని జూ సిబ్బంది
- ఢిల్లీ సంఘటనతోనైనా మేలుకోని వైనం
బహదూర్‌పురా: సందర్శకులు చేష్టలుడిగి చూస్తుండగా... వారి కళ్ల ముందే ఓ వ్యక్తిని పులి పొట్టన పెట్టుకున్న విషాద సంఘటనకు మంగళవారం ఢిల్లీలోని జూ వేదికైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలల్లో భద్రతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చే నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని పులులు, సింహాల ఎన్‌క్లోజర్ల దగ్గర పరిస్థితి ఢిల్లీకి భిన్నంగా ఏమీ లేదు. వీటి చుట్టూ ప్రస్తుతం ఉన్న ఇనుప కంచెల ఎత్తు తక్కువగా ఉండటంతో సందర్శకులు అప్పుడప్పుడు వాటిపైకి ఎక్కి కౄరమృగాలను తిలకిస్తున్నారు.
ఇది ప్రమాదమని తెలిసినప్పటికీ... జంతువులను దగ్గరగా చూడాలనే ఆతృతతో జాగ్రత్తలను పాటించడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో గతంలో ఓ సందర్శకుడు పులి ఎన్‌క్లోజర్ జాలీ నుంచి ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించగా... అతని చేతిని అది పూర్తిగా కోరికేసింది.ఇలాంటి సంఘటనల గురించి తెలిసినప్పటికీ... సందర్శకులు మేలుకోవడం లేదు. ఎన్‌క్లోజర్ల వద్ద వన్యప్రాణులకు బయటి ఆహారాన్ని అందించటం...రాళ్లు విసరటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాలు, పులుల ఎన్‌క్లోజర్ల పరిస్థితిని బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా... అదే తరహా దృశ్యాలు కనిపించాయి.
తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఇనుప తీగెలతో చేసిన కంచె సగం వరకే ఉంది. కొందరు సందర్శకులు ఈ కంచె పైకి ఎక్కుతూ... పులులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు.
ఢిల్లీలోని సంఘటన ఇక్కడి జూ అధికారులను కదిలించినట్టు లేదు. ఇనుప కంచెల పైకి ఎవరూ ఎక్కకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు.
చిన్నారులు ఇనుప కంచెల మీదకు వెళుతున్నా... జూ యానిమల్ కీపర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ వద్ద మోకాళ్ల ఎత్తు వరకే ఇనుప కంచె ఉంది. అక్కడ చిన్నారులను తల్లిదండ్రులు ఇనుప కంచెపై నిలబెట్టి పులులను చూపిస్తున్నారు.
సింహాల ఎన్‌క్లోజర్ వద్ద తక్కువ ఎత్తున్న ఇనుప రాడ్‌లపైకి చిన్నారులతో పాటు పెద్దలు ఎక్కుతూ మృగరాజులను తిలకిస్తూ కనిపించారు. అలా ఎక్కకూడదంటూ యానిమల్ కీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు.
పులులు, సింహాల ఎన్‌క్లోజర్ల వద్ద కంచె ఎత్తును పెంచితేనే ఢిల్లీలాంటి సంఘటనలను నివారించవచ్చు.
పులులు, సింహాలకు బయటి ఆహారాన్ని తినిపించేందుకు చేతులను ఎన్‌క్లోజర్‌కు చాపుతూ ఆహారాన్ని విసరడం వంటివి సందర్శకులు చేస్తున్నారు. దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరాన్ని జూ అధికారులు, సిబ్బంది గుర్తించాలి.