నేటి నుంచి దీపావళి రైళ్ల రిజర్వేషన్లు ప్రారంభం
Published Wed, Aug 28 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
ప్యారిస్, న్యూస్‌లైన్ : దీపావళి పండుగకు రిజర్వేషన్లను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ రెండవ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 60 రోజులు ముందుగానే రైలులో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సారి దీపావళి శనివారం రానుండడంతో ఎక్కువ మంది పండుగను సొంత ఊర్లలో జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 31, దానికి ముందు రోజు నుంచే సొంత ఊర్లకు వెళ్లడం ప్రారంభిస్తారు.
కనుక దీపావళి పండుగకు రిజర్వేషన్లు ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది దీపావళి సమయంలో 120 రోజులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఆ వ్యవధిని 60 రోజులకు తగ్గిం చారు. దీంతో బుధవారం నుంచి రిజర్వేషన్ కౌంటర్లు రద్దీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై ఎగ్మూరు నుంచి దక్షిణాది జిల్లాలైన కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, మదురై, తిరుచ్చికు వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. ఈ కారణంగా పండుగ రోజుల్లో దక్షిణాది జిల్లాలకు అదనపు రైళ్లను నడపాలని ప్రతి ఏటా ప్రయాణికులు కోరుతూనే ఉన్నారు.
గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై నుంచి నాగర్‌కోయిల్, కోవై, నెల్లై, తిరుచ్చి, తూత్తుకుడి తదిత ర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే నడిపింది. వీటి ని పండుగకు రెండు రోజుల ముందు ప్రకటించడంతో పలువురు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోలేకపోయారు. దీంతో దీపావళి పండుగ రోజు, ఆ తర్వాత రోజుల్లో కూడా ప్రత్యేక రైళ్లు ప్రయాణికులు లేక ఖాళీగా నడిచాయి. ఈ ఏడాదైనా దీపావళి ప్రత్యేక రైళ్లను అక్టోబర్ నెలలోనే ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Advertisement