ట్విట్టర్ వార్
మైసూరు: నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీపై చేసిన ట్వీట్‌తో ఎంపీ, మహిళా ఐపీఎస్ అధికారి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు... ఐపీఎస్ అధికారులైన మధుకర్‌శెట్టి, కౌశలేంద్రకుమార్, లాభూరామ్, సోనియాసింగ్‌లను ఇటీవల కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఉన్నత పదవులతో గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుడంటంతోనే ఐపీఎస్ అధికారులు కేంద్రానికి బదిలీపై వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ ప్రతాపసింహ చేసిన ట్విట్టర్‌పై మహిళా ఐపీఎస్ అధికారి రూప అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను రాజకీయ వివాదాల్లోకి రావద్దంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రతీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారికి కేంద్రంలో పని చేయాలనే ఉంటుందంటూ తెలిపిన ఆమె దీనికి రాజకీయ ప్రతినిధులు రాజకీయ రంగు పులమరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల ద్వారా పాలన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తద్వారా పాలన వ్యవస్థ గాడి తప్పుతుందంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రతాపసింహ తాను కేవలం మాధ్యమాల్లో ప్రచురితమైన వార్తలను మాత్రమే షేర్ చేసానని, మీకు వీలైనపుడు ట్వీట్లను మరోసారి పునఃపరిశీలించాలంటూ సూచించారు. దీనిపై మహిళా ఐపీఎస్ అధికారి రూప రాజకీయ నాయకులుగా మీపని మీరు చేసుకుంటూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను వారి పని చేసుకోనివ్వాలంటూ పరోక్షంగా హితవు పలికి ట్విట్టర్‌లో మాటల యుద్ధానికి తెరదించారు.