లొంగిపోయిన ఇద్దరు కీలక మావోయిస్టులు
బెంగళూరు: మావోయిస్టు నేతలైన సిరిమనెనాగరాజ్, నూర్‌జుల్పీకర్‌లు చిక్కమగళూరు కలెక్టర్ బీసీ శేకరప్ప సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లొంగిపోయారు. వీరివెంట సామాజిక వేత్తలు హెచ్‌ఎస్ దొరైస్వామి, గౌరీలంకేశ్, శివసుందర్, నగరిబాబయ్య తదితరులు ఉన్నారు. తాము ఇక శాంతియుత జీవనం కొససాగిస్తామని ఈ సందర్భంగా నాగరాజు, నూర్‌జుల్పీకర్ మీడియా తో పేర్కొన్నారు. తమ లొంగుబాటు వెనుక ఎవరి ఒత్తిడి లేదన్నారు. అనారోగ్య కారణాలతో తా ము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామన్నది కేవలం అసత్యప్రచారమని కొట్టిపారేశారు. తమ మనస్సాక్షికి అనుగుణంగానే నడుచుకుంటున్నామన్నారు.
ఇదిలా ఉం డగా ఈ ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడానికి కొద్ది గంటల మందు కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇరురాష్ట్రాల ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కొంతమంది కరపత్రాలను పంచుతూ తమనుతాము మావోయిస్టులుగా పరిచయం చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. మరోవైపు చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమైన మావోయిస్టుల లొంగుబాటుకు ప్రభుత్వం అంగీకరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి అభిప్రాయపడ్డారు. దీని వల్ల పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.