న్యూఢిల్లీ: యువతిపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అతడిని ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలపడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ నిందితుడు యాదవ్‌కు ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు యాదవ్‌ను తీహార్ జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న లాయర్లు యాదవ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగానే పెద్ద పెట్టున గందరగోళం సృష్టించారు. యాదవ్ తరఫున ఓ న్యాయవాది వాదించడాన్ని వారు వ్యతిరేకించారు.
లాయర్లందరూ సమ్మెలో ఉన్నారని, కోర్టు విచారణలో ఎవరూ పాల్గొనరాదని వారు డిమాండ్ చేశారు. అయితే కోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని మేజిస్ట్రేట్ న్యాయవాదులను మందలించారు. విచారణాధికారిపై కోర్టు ఆగ్రహం: ఉబర్ క్యాబ్ రేప్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి గురువారం కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. కోర్టు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలివ్వలేకపోవడంతో మేజిస్ట్రేట్ తీవ్రంగా మందలించారు. నిందితుడు శివకుమా ర్ యాదవ్ వద్దనున్న డ్రైవింగ్ లెసైన్స్ సరైందేనా లేక నకిలీదా? అతడిని ఉబర్ సంస్థ ఎప్పుడు ఉద్యోగంలో చేరుక్చుంది? అన్న ప్రశ్నలకు దర్యాప్తు అధికారి రేణు మౌనం వహించారు. ఆమె సమాధానం చెప్పలేకపోవడంతో ‘‘ఆమెకేమీ తెలి యదు, ఈ కేసులో ఎవరు నిజమైన దర్యాప్తు అధికారి?’’అని మేజిస్ట్రేట్ ప్రశ్నిం చారు.
దీంతో మరో పోలీస్ అధికారి ముందుకు వచ్చి సమాధానం ఇచ్చారు. యాదవ్ లెసైన్స్ నకిలీదని తేలిందని, నెల రోజుల క్రితమే అతడు ఉబర్ సంస్థలో చేరాడని చెప్పారు. ‘‘కంపెనీ అతడి వివరాలను పరిశీలించిందా? పరిశీలించకపోతే... ఎవరిపై మీరు కేసు నమోదు చేశారు’’ అని మేజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారు. దీనికి పోలీసు అధికారులు సమాధానం ఇస్తూ, యాదవ్‌ను అమెరికాకు చెందిన ఉబర్ కంపెనీ డ్రైవర్‌గా చేర్చుకుందని, ఆ సంస్థ అతడి వివరాలను పరిశీలించలేదని, ఆ కంపెనీపై చీటింగ్ కేసు నమోదు చేశామని చెప్పారు.రెండువారాల్లోనే చార్జిషీట్: ‘ఉబ్బర్’ రేప్ ఘటనపై చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసులు రికార్డుస్థాయిలో రెండువారాల్లోనే సిద్ధం చేశారు. డిసెంబర్ 12, 2012 సామూహిక లైంగిక దాడి కేసు చార్జిషీట్‌ను 17 రోజుల్లో దాఖలు చేసిన పోలీసులు, ఈ సారి రెండువారాల్లోనే సిద్ధం చేయడం గమనార్హం.
కస్టడీకి ఉబర్ క్యాబ్ డ్రైవర్
Published Thu, Dec 11 2014 11:51 PM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM
Advertisement