రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల పని విధానంతో పాటు వాటి రూపురేఖలు కూడా మారనున్నాయి. ఇకపై ఈ కేంద్రాలు ప్రైవేటు విద్యా సంస్థలకు...
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల పని విధానంతో పాటు వాటి రూపురేఖలు కూడా మారనున్నాయి. ఇకపై ఈ కేంద్రాలు ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా పిల్లలకు ప్రీ ప్రైమరీ (పూర్వ ప్రాథమిక) విద్యా విధానాన్ని బోధించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని ఈ కేంద్రాల్లో ఉపాధ్యాయులగా ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అధికశాతం తాగు నీరు, విద్యుత్, శౌచాలయాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోని విషయ తెల్సిందే. దీంతో పిల్లలు కూడా ఈ కేంద్రాలకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీపీఐ) ఓ సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. ఈ నివేదిక ప్రకారం... మొదట అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలన ు మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా చిన్న పిల్లలను ఆకర్షించేలా చర్యలు చేపడతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసు మధ్య గల పిల్లలను ఈ కేంద్రాల్లోని ఎల్‌కేజీలోకి చేర్చుకోనున్నారు. అదే విధంగా నాలుగు నుంచి ఐదేళ్ల వ యసు మధ్య ఉన్న పిల్లలను యూకేజీలో చేర్చుకోనున్నారు.
కిండర్‌గార్డెన్, ప్రీ ప్రైమరీ విద్యా విధానంలో శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తారు. కాగా ఈ కేంద్రాల్లో విద్యనభ్యసించే పిల్లలు ఎటువంటి పుస్తకాలు, పెన్నులు తీసుకురావాల్సిన అవసరం లేదు. నిపుణులు రూపొందించిన టీచింగ్-లర్నింగ్ మెటీరియల్‌తోనే వీరికి విద్యా బోధన ఉంటుంది. దీనిని విద్యా పరిభాషలో ‘సైకోమోటార్ లర్నింగ్’ అంటారు. వీరికి యూనిఫాంలు, షూ తదితర వస్తువులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అంగన్‌వాడీ టీచర్లు, వారి సహయకులు పిల్లల బాగోగులను చూసుకుంటారు.
కాగా రూపురేఖలు మారిన కేంద్రాలను ‘చిన్నార చిలి-పిలి’ కేంద్రాలుగా పిలవనున్నారు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలను నూతన విధానంలోకి తీర్చిదిద్దడానికి వీలుకాని చోట నూతనంగా ‘చిన్నార చిలి-పిలి’ కేంద్రాలను నిర్మించడం కాని లేదా ప్రాథమిక పాఠశాలలు ఉన్న భవంతుల్లోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జిల్లాకు సగటున 200 చొప్పున రాష్ట్రం మొత్తం మీద 6,800 ‘చిన్నార చిలి-పిలి’ కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం హాసన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ‘మక్కెల-మనె’ (పిల్లల ఇళ్లు) పేరుతో దాదాపు ఇలాంటి విధానాన్నే డీపీఐ...రాష్ట్ర శిశుసంక్షేమశాఖ సహకారంతో అమలు చేస్తోంది.
‘మక్కెల మనే’ మంచి ఫలితాలను ఇస్తుండటంతో కొద్ది మార్పులతో నూతన విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ విషయమై డీపీఐ డెరైక్టర్ మాట్లాడుతూ... ‘ఈ విధానానికి ప్రాథమికంగా రూ.110.5 కోట్లు కాగలవని అంచనా. ఒక్కొక్క చిన్నార చిలి-పిలి కేంద్రలో 25 మంది పిల్లలు ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఈ విధానం అమల్లోకి రావడం వల్ల పిల్లల ప్రాథమిక విద్యను ఉత్సాహంగా నేర్చుకుంటారు. ప్రభుత్వం నూతన విధానంపై సానుకూలంగానే స్పందించింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నాం.’ అని పేర్కొన్నారు.