ఫీనిక్స్ పక్షి!
కెప్టెన్ కొత్త నినాదం
65వ వసంతంలోకి విజయకాంత్
మక్కల్ ఇయక్కం నేతల శుభాకాంక్షలు
స్నేహ పూర్వక పలకరింపు : వైగో, తిరుమా
సరైన సమయంలో నిర్ణయం : ప్రేమలత
సాక్షి, చెన్నై: తమ నేత విజయకాంత్ పేరుకు ముందు కెప్టెన్ అన్న పదం డీఎండీకే వర్గాలకు కలిసి రానట్టుంది. అందుకే ఇక, తమ నేతను ఫీనిక్స్‌పక్షితో పోల్చే పనిలో పడ్డట్టున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం ఆయన బర్త్‌డే కేక్‌లలో ‘ఫీనిక్స్ పక్షి’ అని తాటి కాయంత అక్షరాలతో కొన్ని నినాదాల్ని పొందు పరచి ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీఎండీకే అధినేత విజయకాంత్ చతికిలబడ్డ విషయం తెలిసిందే. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామన్న ధీమాతో డీఎండీకే వర్గాలు ఉన్నాయి. తమ నేత బర్త్‌డే తదుపరి జరిగే కార్యక్రమాలతో డీఎండీకే పుంజుకున్నట్టే అన్న వ్యాఖ్యల్ని సంధించడం మొదలెట్టారు.
ఇందుకు తగ్గట్టుగా గురువారం 65వ వసంతంలోకి అడుగుపెట్టిన విజయకాంత్‌ను అభినందనలతో ముంచెత్తిన డీఎండీకే వర్గాలు, ఇక తమ నేత ఫీనిక్స్‌పక్షి అన్నట్టు నినాదాన్ని అందుకోవడం విశేషం. ఎట్టి ఆటుపోట్లు ఎదురై కింద పడ్డా, మళ్లీ చటుక్కున పుంజుకుని రయ్యూ మంటు గాల్లో దూసుకు వెళ్లే ఫీనిక్స్‌పక్షితో తమ నేత విజయకాంత్‌ను పోల్చడం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే అంటూ డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఫీనిక్స్‌పక్షి:
విజయకాంత్ బర్త్‌డేను పురస్కరించుకుని శాలిగ్రామంలోని ఆయన నివాసం పరిసరాల్ని డీఎండీకే వర్గాలు సుందరంగా తీర్చిదిద్దాయి. పార్టీ తోరణాలు, జెండాలతో ఆలంకరించడంతో పాటు విజయకాంత్ ఇంటి వద్ద ఏదో పండుగ అన్నట్టుగా వాతావరణం కల్పించారు. ఉదయాన్నే విజయకాంత్‌కు ఆయన సతీమణి ప్రేమలత, తనయులు షణ్ముగపాండియన్, విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ నిలువెత్తు పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పటికే బారులు తీరిన పార్టీ వర్గాలు, కేడర్ ఒక్కక్కరుగా విజయకాంత్‌కు స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి పదకొండు గంటల సమయంలో కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయకాంత్‌కు బ్రహ్మరథం పలికారు.
మక్కల్ ఇయక్కంకు చెందిన ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం తరఫున సంపత్ అక్కడికి చేరుకుని నిలువెత్తు పూలమాలతో, శాలువలతో సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ ఫీనిక్స్ పక్షి అన్న పదంతో, నేడు చతికిల బడ్డా, రేపు అధికారం అన్న నినాదంతో పొందు పరిచిన భారీ కేక్‌ను విజయకాంత్‌తో కలిసి వైగో, తిరుమావళవన్ కట్ చేశారు. తమ స్నేహాన్ని చాటుకునే రీతిలో కేక్ కత్తిరింపు సాగింది. తదుపరి పార్టీ కార్యాలయంలో నేతలందరూ కాసేపు సమాలోచన అయ్యారు. అనంతరం వెలుపలకు వస్తూ, మీడియాతో వైగో మాట్లాడుతూ మక్కల్ ఇయక్కంలో ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ ఉన్నాయని, ఈ నాలుగు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొంటాయని వ్యాఖ్యానించారు.
విజయకాంత్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామేగానీ, ఎలాంటి రాజకీయం చర్చ లేదని స్పష్టం చేశారు. ఇక, తిరుమావళవన్ మాట్లాడుతూ స్నేహ పూర్వక పలకరింపు మాత్రమేనని, స్థానిక చర్చకు ఆస్కారం లేదన్నారు. విజయకాంత్ సతీమణి, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సాగుతున్న తీరును చూస్తుంటే, అధికార పక్షం బలహీన పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక సమరం గురించి సరైన సమయంలో విజయకాంత్ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్‌కు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ఇళంగోవన్ పలువురు ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.