కొత్త పలకరింపు
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయచర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ వైపునకు డీఎండీకేను తిప్పుకుని డీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. అయితే, మెట్టు దిగని విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరి డిపాజిట్లనే కాదు, పార్టీ పరంగా తీవ్ర కష్ట నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్ స్థానిక ఎన్నికలతో బలాన్ని చాటుకునేందుకు తీవ్ర కుస్తీలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. గత వారం స్టాలిన్‌కు వ్యతిరేకంగా తిరునావుక్కరసర్ స్పందించిన తీరు డీఎంకే వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ డీఎంకేకు అనుకూలంగా తిరునావుక్కరసర్ స్పందించే యత్నం చేస్తున్నా, డీఎంకే వర్గాలు మాత్రం కాంగ్రెస్‌కు స్థానికంలో చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేకు అనుకూలంగా స్పందించిన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి గుణపాఠం చెప్పే దిశలో స్థానిక సీట్ల బేరాల్లో పొమ్మని పొగ బెట్టే విధంగా వ్యవహరించాలని అధిష్టానంపై పలువురు డీఎంకే నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో తిరునావుక్కరసర్ డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయింది. తమ భేటీలో స్థానిక చర్చ సాగినట్టు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. డీఎంకే పక్కన పెట్టిన పక్షంలో డీఎండీకేతో కలసి పయనించేందుకు తగ్గట్టుగా స్థానిక చర్చ సాగి ఉంటుందేమో అన్న ప్రచారం ఊపందుకోవడం ఆలోచించదగ్గ విషయమే.కొత్త పలకరింపు : కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కోయంబేడులోని డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి కూడా ఉన్నారు. తమ కార్యాలయానికి చేరుకున్న తిరునావుక్కరసర్‌కు డీఎండీకే అధినేత విజయకాంత్, యువజన నేత సుదీష్ ఆహ్వానం పలికారు.
మర్యాద పూర్వక పలకరింపుల్లో రాజకీయ, స్థానిక చర్చ సాగి ఉండడం గమనార్హం. మీడియాతో తిరునావుక్కరసర్ మాట్లాడుతూ విజయకాంత్‌తో భేటీలో ప్రస్తుత రాజకీయ అంశాలపై మాట్లాడుకున్నామని, స్థానిక ఎన్నికలపై చర్చించుకున్నామని స్పందించారు. విజయకాంత్ తనకు మిత్రుడు అని, ఆయన్ను మర్యాద పూర్వకంగా పలకరించేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు.