బీజేపీలోకి డీఎండీకేను విలీనం చేయడానికి కసరత్తులు జరుగుతున్నట్టు రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది. బీజేపీ సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును త్వరలో ప్రధాని మోడీ ప్రకటించనున్నారన్న చర్చ జోరందుకుంది. ఢిల్లీ వేదికగా ఇందుకు సంబంధించిన మంతనాలు సాగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ర్టంలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సాక్షి, చెన్నై: సినీ నటుడిగా అశేష ప్రేక్షాకాభిమానుల హృదయాల్లో ముద్ర వేసుకున్న విజయకాంత్ తొలుత డీఎంకేవాది. ఆ పార్టీలో నెలకొన్న విబేధాలతో బయటకు వచ్చిన విజయకాంత్ 2005లో పార్టీ స్థాపించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన అనతి కాలంలో తన సత్తాను ద్రవిడ పార్టీలకు చూపించారు. తానొక్కడినే అసెంబ్లీకి ఎన్నికైనా, ఆయన సాధించిన ఓటు బ్యాంక్ ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2011 ఎన్నికల్లో డీఎంకేను ఓడించడం లక్ష్యంగా అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించిన విజయకాంత్ జాతీయ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ మన్ననలు అందుకున్న విజయకాంత్ రాష్ట్రంలో తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కావాలన్న కాంక్షతో ముందుకెళుతున్నారు.
కల సాకారమయ్యేనా?: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో విజయకాంత్‌లో ఆశలు చిగురించాయి. లోక్ సభ ఎన్నికల్లో తమ డిపాజిట్లు గల్లంతైనా, మోడీ పీఎం కావడంతో తన కల నెరవేరుతుందన్న ధీమాతో ఉన్నారు. కనిపించినప్పుడల్లా మోడీ తనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ రావడంతో విజయకాంత్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీ బలంగా ఉన్నా, సీమాంధ్ర, తెలంగాణల్లో కొంత మేరకు బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం కాస్త వెనుకబడి ఉండడాన్ని మోడీ తీవ్రంగా పరిగణించినట్టు డీఎండీకేలో చర్చ సాగుతోన్నది. ఒంటరిగా రాష్ర్టంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే, విజయకాంత్‌కు అంత సులభం కాదని, తమతో చేతులు కలపాలంటూ ఆయనకు మోడీ ఆహ్వానం పలికినట్టు చెబుతున్నారు. ఇంకెన్నాళ్లు ఒంటరిగా పార్టీని నెట్టుకొస్తారని, తమ పార్టీలో విలీనం చేయాలంటూ మోడీ ఆఫర్ ఇచ్చినట్టు, దీన్ని విజయకాంత్ పరిశీలిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీజేపీ సీఎం అభ్యర్థి : బీజేపీలో పార్టీని విలీనం చేసిన పక్షంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును ముందుగానే ప్రకటించేందుకు మోడీ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు పెద్దగా ప్రజల్లో ఆదరణ లేని దృష్ట్యా, విజయకాంత్ ద్వారా తమిళనాడులో పాగా వేయడానికి మోడీ వ్యూహ రచనలు చేసినట్టు సమాచారం. ఇక, జూన్ మొదటి లేదా, రెండో వారంలో తమిళనాడులో కృతజ్ఞత మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాట్లు తెలుస్తోంది. ఈ మహానాడు వేదికగా విలీన నిర్ణయాన్ని విజయకాంత్ ప్రకటించ వచ్చన్న ప్రచారం వేగం పుంజుకుంటున్నది. బీజేపీలోకి విలీనం చేయడం మంచిదన్న నిర్ణయాన్ని డీఎండీకే నేతలు పలువురు విజయకాంత్‌కు సూచించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్ తరహాలో మోడీ నాయకత్వంలో తమిళనాడును అభివృద్ధి పరుస్తామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లొచ్చన్న సూచనను ఇచ్చినట్టు పేర్కొంటున్నాయి. మోడీ తనకు అండగా ఉన్న దృష్ట్యా, రాజపక్సే ఆహ్వానంపై విజయకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు సంధించలేదని చెబుతున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం నిమిత్తం ఉదయాన్నే తన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌తో కలసి ఢిల్లీ వెళ్లిన విజయకాంత్ బీజేపీ అగ్రనేతలతో సమాలోచన జరిపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దేశ రాజధాని వేదికగా విలీన మంతనాలు సాగడంతో కెప్టెన్ తన పార్టీ బోర్డును తిప్పేసేనా లేదా, తాను ఒంటరేనా అని చాటుకుంటారా అన్నది మరి కొద్ది రోజుల్లో తేలబోతున్నది.
విలీనమా?
Published Tue, May 27 2014 12:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement