
‘కరుణ’ జపం
డీఎండీకే అధినే త విజయకాంత్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి నామాన్ని జపించేపనిలో పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
* కరుణానిధి చిత్రపటాల్ని ప్రభుత్వ కార్యాలయల్లో పెట్టాల్సిందే
* లేకుంటే ఆందోళనలు తప్పవు : విజయకాంత్
సాక్షి, చెన్నై: డీఎంకేపై విమర్శలు గుప్పించడంలో డీఎండీకే అధినేత విజయకాంత్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆ పార్టీ మీద కన్నా, జయలలిత మీద విమర్శల స్వరం పెంచారు. అలాగే, ఈ సారి ఏకంగా కరుణానిధి జపం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఐదు సార్లు సీఎంగా పనిచేసిన కరుణానిధి మహానాయకుడు అని, ఆయన చిత్ర పటం ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా ఉంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడం గమనార్హం.
కరుణ చిత్ర పటాల్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాల్సిందే
శుక్రవారం డీఎండీకే అధినేత విజయకాంత్ ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సీఎం పన్నీరు సెల్వంను టార్గెట్‌చేసి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే మంత్రులు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సీఎం జయలలిత, ప్రజా సీఎం జయలలిత అని జపిస్తూనే, ఆమె మార్గదర్శకంలోనే ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేయడం విచారకరమన్నారు. జైలు శిక్ష ఎదుర్కొంటున్న జయలలిత ప్రజా సీఎం అయితే, తమరు ఎవరికి సీఎం అని పన్నీరు సెల్వంను ప్రశ్నించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత చిత్ర పటాల్ని ఏర్పాటుచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని అడ్వకేట్ జనరల్ సోమయాజులు మదురై ధర్మాసనంలో స్పష్టంచేసి ఉన్నారని గుర్తుచేశారు. జైలు శిక్ష ఎదుర్కొం టున్న వాళ్ల ఫొటోల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ప్రజా సీఎంలుగా ఉన్న కామరాజర్, అన్నా, ఎంజీయార్ చిత్రపటాల్ని తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయూల్లో ఏర్పాటు చేయూల్సిందేనన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, అలాంటి నాయకుడి చిత్ర పటాన్ని సైతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజలతో కలసి పోరాటాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.