చిన్నమ్మ ప్రసన్నం కోసం బారులు
సాక్షి, చెన్నై : బ్యాంకుల ముందు, అమ్మ సమాధి ముందు కన్నా, పోయెస్ గార్డెన్ వద్ద క్యూ రోజురోజుకు పెరుగుతోంది. చిన్నమ్మ శశికళను పరామర్శించేందుకు బారులు తీరే వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్నమ్మను ఓదార్చే వాళ్లు కొందరు అయితే, మీరే దిక్కు అన్నట్టు నినదించే వాళ్లు మరి కొందరు. దీంతో పోయెస్ గార్డెన్ మార్గంలో నిత్యం సందడే. దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ప్రాణాలతో ఉన్న సమయంలో ఆ మార్గంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. పోయెస్ గార్డెన్ లోని వేదా నిలయం వద్ద అవసరం అయితే, తప్పా, మిగిలిన సందర్భాల్లో పార్టీ వర్గాలే కాదు, సామాన్యులు కూడా నిలబడేందుకు అవకాశం ఉండదు. ఇక, ఆ ఇంట్లోకి ముఖ్యులు తప్పా, మరెవ్వర్నీ అనుమతించే వారు కాదు. అది కూడా అవసరాన్ని బట్టే. అంతటి కట్టుదిట్ట భద్రత నడుమ ఉండే వేదా నిలయం, ఇప్పుడు చినమ్మకు పరామర్శలు, ఓదార్పులకు, సందర్శకులకు నిలయంగా మారింది.
ఇంత వరకు అమ్మ జయలలిత ఇళ్లు ఎలా ఉంటుందో అన్న విషయం కూడా తెలియని వాళ్లందరూ ఇప్పుడు అక్కడ క్యూ కట్టే పనిలో పడ్డారు. అమ్మ మరణంతో అక్కడ చిన్నమ్మ శశికళ ఉన్నారు. దీంతో చినమ్మను పరామర్శించేందుకు, ఓదార్చేందుకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తొలుత పార్టీ ముఖ్యులు, తదుపరి జిల్లాల నేతలకు ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఇవ్వగా, ప్రస్తుతం అక్కడ ఇంత వరకు తమ పాదం కూడామోపని వాళ్లు సైతం క్యూ కట్టే పనిలో పడ్డారు. బ్యాంక్‌ల ముందు, అమ్మ సమాధి వద్ద కన్నా చిన్నమ్మకు పరామర్శ నిమిత్తం పోయెస్ గార్డెన్ లో క్యూ కట్టే వారి సంఖ్య పెరిగినంతగా పరిస్థితి ఉండడంతో ఆ గార్డెన్ లోని ఇతరులకు విస్మయం తప్పడం లేదు. ఇన్నాళ్లు చడీ చప్పుడు కాకుండా, భద్రత నడుమ ఉండే, అమ్మ ఇంటి రోడ్డులో ఇప్పుడు నిత్యం వాహనాలు, పరామర్శలకు వచ్చే వాళ్ల హడావుడితో సందడి నెలకొంది.
ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరామర్శలు హోరెత్తుతుండడం గమనించాల్సిన విషయం. కొందరు అయితే, చిన్నమ్మా నీవే దిక్కు అని నినాదిస్తుంటే, మరి కొందరు జయలలిత ఇంట్లోకి వెళ్లి మరీ పరామర్శించి వస్తున్నారు. కొందరికి లోనికి అనుమతి లభిస్తుండగా, మరి కొందరు ఇంటి గుమ్మం వద్ద క్యూ కట్టాల్సిందే. గురువారం కూడా పెద్ద సంఖ్యలో ఆయా సంఘాలు, సామాజిక వర్గాల పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అన్నాడీఎంకే వర్గాలతో పోయెస్ గార్డెన్ వద్ద పెద్ద క్యూ కనిపించడం గమనార్హం. ఇక, సినీ నటులు, అన్నాడీఎంకే వ్యాఖ్యాతలు సీఆర్ సరస్వతి, రామరాజన్, సెంథిల్, గుండు కల్యాణం వంటి వారితో పాటు రియో పారాలింపిక్‌లో పతకం సాధించిన తమిళ తంగం మారియప్పన్ తంగవేలు తన కోచ్ సత్యనారాయణతో కలిసి పోయెస్ గార్డెన్ కు వచ్చారు.
బంగారు పతకాన్ని చిన్నమ్మకు చూపించి వెళ్లాడు. పతకం సాధించిన సమయంలో రూ. రెండు కోట్ల నగదు బహుమతిని అమ్మ జయలలిత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇంత వరకు ఆ బహమతి మారియప్పన్ తంగవేలు దరిచేర లేదన్న సంకేతాలు ఉన్నాయి. చిన్నమ్మ అయినా, దృష్టి పెట్టేనా అన్న ఆశ తంగవేలు అభిమానుల్లో నెలకొంది.