పోలీస్ కూతురి దొంగ ప్రేమ
*ప్రేమించిన వాడి కోసం నగలు చోరీ
* భర్త మాటలు బేఖాతరు
* పట్టించిన కుదవ రసీదులు
బెంగళూరు :దొంగతనానికి పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమార్తె, ఆమె ప్రియుడిని స్థానిక జ్ఞానభారతీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో నాగరబావి 8వ బ్లాక్‌కు చెందిన భాగ్యలక్ష్మి, అగ్రహార దాసరహళ్లికి చెందిన మధు ఉన్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలు ఇలా... అగ్రహార దాసరహళ్లిలో నివాసముంటున్న ఓ యువకుడికి నాగరబావికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుమార్తె భాగ్యలక్ష్మితో 2012న వివాహమైంది.
అనంతరం వీరు అగ్రహార దాసరహళ్లిలో నివాసం ఏర్పరుచుకున్నారు. వీరి ఇంటిపక్కనే నివాసముంటున్న మధుతో భాగ్యలక్ష్మికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా భాగ్యలక్ష్మిని పద్ధతి మార్చుకోవాలంటూ ఆమె భర్త హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. జులాయిగా తిరిగే మధుకు నగదు సాయం చేస్తుండేది. 2013లో కాన్పు కోసం తన పుట్టింటికి భాగ్యలక్ష్మి వెళ్లింది. ఆ సమయంలో మధు వెళ్లి ఆమెని కలిశాడు. ఖర్చుల కోసం నగదు కావాలని అడిగాడు. దీంతో పుట్టింటిలో ఉన్న బంగారు నగలు ఒక్కొక్కటి చోరీ చేసి ప్రియుడికి ఆమె ఇస్తూ వచ్చింది. ఆ నగలు కుదవ పెట్టి వచ్చిన నగదుతో మధు జల్సాలు చేసేవాడు.
అయితే తాను కుదవ పెట్టిన సమయంలో ఇచ్చిన రసీదులు భాగ్యలక్ష్మికి ఇచ్చాడు. వాటిని ఆమె ఇంటిలో దాచిపెట్టింది. ఇలా మొత్తం 750 గ్రాముల బంగారు నగలు కుటుంబసభ్యులకు తెలియకుండా ఆమె తీసి ఇచ్చింది. ఇంటిలో నగలు కనిపించకపోవడంతో గత నెల గుర్తించిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు కోణాలు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఇంటిలో దాచిపెట్టిన రసీదులు లభ్యమయ్యాయి. దీంతో భాగ్యలక్ష్మిని గట్టిగా నిలదీయడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు భాగ్యలక్ష్మి, మధుని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు వారికి జామీను మంజూరు చేసింది.