మహిళలకు భూమిమీదే కాదు ఆకాశంలోనూ రక్షణ కరువయింది.
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): మహిళలకు భూమిమీదే కాదు ఆకాశంలోనూ రక్షణ కరువయిందని ఇటీవల విమానాల్లో జరుగుతున్న వేధింపుల ఘటనలు చాటుతున్నాయి. గత మంగళవారం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి బయలుదేరిన విమానంలో ఒక మహిళకు ఎదురైన చేదు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన మహిళ బెంగళూరు నుంచి తెల్లవారుజామున విమానంలో ముంబైకి బయలుదేరారు. ఆమె నిద్రలోకి జారుకోగా, పక్కసీట్లో ఉన్న తమిళనాడుకు చెందిన వ్యాపారి కామాంధుడు నిద్రలేచాడు.
బాధితురాలు నిద్రలోకి జారుకోగానే ఇతగాడు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆమెను తాకడం ప్రారంభించాడు. అతని వ్యవహారం చూసి ఆమె తన సీట్లో ఒదిగికూర్చున్నారు. అతడు ఇదే అవకాశంగా తీసుకుని ఆమెను తాకుతూ హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు తక్షణం విమానంలో సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది వచ్చే సమయానికి అతడు ప్యాంట్‌కు జిప్ వేసుకోవడం కనిపించింది. విమాన సిబ్బంది బాధితురాలికి వేరే సీటు కేటియించారు. ముంబైలో విమానం దిగగానే బాధితురాలి ఫిర్యాదుమేర పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి బయల్దేరిన విమానంలో గడిచిన 10 రోజుల్లో వేధింపుల ఘటన జరగడం ఇది రెండోసారి.