డీఎఫ్‌కు గడ్డుకాలమే!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) కూటమి ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది...ఇప్పటికే ఆదర్శ్ కుంభకోణం, జలవనరుల కుంభకోణం...తాజాగా పాల కుంభకోణం...ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో అధికార పార్టీల నేతల పేర్లు తెరమీదకు వస్తుండటంతో కాంగ్రెస్, ఎన్సీపీల ప్రతిష్ట దిగజారుతోంది. ఆయా కుంభకోణాలతో ప్రజల దృష్టిలో పలుచన అవుతున్న డీఎఫ్ కూటమికి ముందుంది మరింత గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.
ఇప్పటికే పదిహేనేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి (శివసేన, బీజేపీ) అందివచ్చిన ప్రతి అంశాన్ని విడవడం లేదు. అధికార పార్టీ నేతలపై అవినీతి విషయంలో రాజీలేని పోరు చేస్తోంది. దీనికితోడు ఇటీవల బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముంబైలో నిర్వహించిన సభ విజయవంతమవడంతో ఆ పార్టీ నేతలు మంచి ఊపుతో ముందుకెళుతున్నారు. ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎం అశోక్ చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతివ్వని గవర్నర్ కె.శంకర్ నారాయణన్ తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతున్నారు. ముంబైకి కరువైన భద్రత, రోజురోజుకు ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు ఇలా ప్రతి అంశాన్ని రాబోయే ఎన్నికల్లో అస్త్రాలుగా వినియోగించేందుకు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. అయితే అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఎన్నికల్లో ఏ వ్యూహన్ని అమలుచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అధికార పార్టీకి తిప్పలే...
అవినీతి కుంభకోణాలు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రులు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతోపాటు అశోక్ చవాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జల వనరుల కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాల కుంభకోణంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర మంత్రి నారాయణ రాణేలపై కేసు నమోదవడం వారికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎంకు ఆదర్శ్ బురద...
అయితే ఇటీవలే ఆదర్శ్ కేసులో అశోక్ చవాన్‌పై దర్యాప్తు చేసేందుకు సీబీఐ అనుమతి కోరగా, దాన్ని రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ తిరస్కరించారు. దీంతో అశోక్ చవాన్‌కు క్లీన్‌ఝట్డఏ లభించినట్టేనని అందరూ భావించారు. ఈ విషయమై అనేక పత్రికల్లో కూడా అశోక్ చవాన్‌కు మంచిరోజులు వచ్చాయన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో దర్యాప్తు నివేదికను ఎట్టకేలకు శీతాకాల సమావేశాల్లో సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రజాహితం కోసం ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని సీఎం పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శ్ వివాదంలో ఇరుక్కుపోయిన తమ నాయకులను రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ఇప్పటివరకు ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న సీఎం పృథ్వీరాజ్‌కు ఆదర్శ్ బురద అంటుకుంటోందని కొందరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. నివేదికను, చర్చలను తోసిపుచ్చడంతోపాటు ప్రజల శ్రేయస్సు కోసమే ఇలా చేశానని పృథ్వీరాజ్ చెప్పడంపై ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని పలుచన చేస్తుందని అంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలను కాదనలేకపోతున్నారు.
గవర్నర్ పునఃపరిశీలించాలి: వినోద్ తావ్డే
ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని విధాన మండలి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే కోరారు. ఈ విషయమై గవర్నర్ కె. శంకర్ నారాయణ్‌కు ఓ లేఖ రాశారు. అశోక్ చవాన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టవద్దని తీసుకున్న నిర్ణయంపై మళ్లీ పరిశీలించాలని ఆ లేఖలో కోరారు. సీబీఐకి ఆయనను దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.