
'యువతకు దానిపై అవగాహన లేదు'
యువతకు ఒబెసిటీపై కనీస అవగాహన కరువైందని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది
ఢిల్లీ: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు యువతను ఒబెసిటీ(స్థూలకాయత్వం) వైపు మళ్లిస్తున్నాయి. అయితే స్థూలకాయత్వం బారిన పడుతున్న యువత దాని దుష్పరిణామాల గురించి తెలుసుకోవడం కాదుకదా.. కనీసం తాము స్థూలకాయులం అని కూడా అంగీకరించే స్థితిలో ఉండటం లేదని తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలోని 20 నుంచి 45 ఏళ్ల మధ్యగల సుమారు 1000 మందిపై జరిపిన పరిశీలనలో 80 శాతం మంది ఉండాల్సినదానికన్నా అధిక బరువు ఉన్నారు. అయితే వీరిలో కేవలం 20 శాతం మంది మాత్రమే తాము స్థూలకాయులం అని అంగీకరిస్తున్నారు.
యువతకు ఒబెసిటీపై అవగాహనలేకపోవడం వల్ల వారు తీసుకునే ముందుజాగ్రత్తలు తగ్గుతాయని మ్యాక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ డాక్టర్ ప్రదీప్ చౌదరి వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 70 శాతం మందికి ఒబెసిటీతో హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ముప్పు ఉంటుందనే విషయం తెలియదని తేలిందన్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్ యువతను స్థూలకాయులుగా మార్చుతున్నాయని వెల్లడించారు.