ఇది విన్నారా?
చెన్నై : సినిమా కొత్త పుంతలు తొక్కుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎల్లలు దాటుతున్న మన సినిమాలో ప్రేక్షకుల మనసు దోచుకునే అంశం ఏదో ఒకటి పొందుపరచడానికి దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారు. అందుకు కొందరు గ్రాఫిక్స్‌ను వాడుకుంటుంటే మరి కొందరు సర్ప్రైజింగ్గా అతిథి తారల మెరుపులతో మైమరపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఓం శాంతి ఓం అనే హిందీ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ తారలందరూ షారూఖ్‌ఖాన్‌తో సింగిల్ సాంగ్‌లో నటించి కనువిందు చేశారు. అంతకు ముందే ఒక తెలుగు చిత్రంలో ఇలాంటి తారల హేలను చూశాం.
నాగార్జున నటించిన కింగ్ చిత్రంలోనూ ఒక పాటలో టాప్ తారలు మెరిశారు. ఇక అలాంటి ఒక సందడి వాతావణం తాజాగా ఇంజి ఇడుప్పళగి చిత్రంలో ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచనుందని కోలీవుడ్ వర్గాల టాక్. ఇది ద్విభాషా చిత్రం. తెలుగులో జీరోసైజ్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్య, అనుష్క నాయికా నాయకులుగా నటించారు. ఒక ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో అందం ప్రధాన పాయింట్‌గా నిలవనుంది. అనుష్క సుమారు 100 కిలోల బరువు గల అమ్మాయిగా సన్నగా నాజూగ్గా ఉండే యువతిగా రెండు డైమన్షన్తో సాగే పాత్రలో నటించారు.
ఈ ఒక్క అంశం చాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి, వారిని థియేటర్లకు రప్పించడానికి. చిత్ర దర్శకుడు కేఎస్.ప్రకాశ్‌రావు ఇంకా ఎట్రాక్షన్ అంశాలను చిత్రంలో జోడించారన్నది మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం. అదేమిటంటే ఇంజిఇడుప్పళగి చిత్రంలో అతిథులుగా తొమ్మిది మంది స్టార్స్ మెరవనున్నారట. అనుష్కకు అత్యంత సన్నిహితుడుగా ప్రచారంలో ఉన్న టాలీవుడ్ స్టార్ నాగార్జున, రాణాతో పాటు కోలీవుడ్ స్టార్స్ ఆర్య, జీవా, బాబీసింహా, సీనియర్ నటి రేవతి, క్రేజీ భామలు కాజల్ అగర్వాల్, హన్సిక, శ్రీదివ్య తదితర స్టార్స్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. ఈ సంస్థ మరో చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన బెంగళూర్ డేస్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.
ఇందులో ఆర్య, బాబీసింహా, రాణా, శ్రీదివ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ కారణంగా వారు ఇంజిఇడుప్పళగి చిత్రంలో అతిథులుగా మెరిసే అవకాశం ఉంది. మరి నాగార్జున నటించడానికి కారణం అనుష్క అనుకుంటున్నారా? అదేమో గానీ నాగార్జునకు పీవీపీ సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఇక జీవా ఆర్యకు మంచి మిత్రుడు కాబట్టి ఆయన ఆ చిత్రంలో అతిథిగా మెరవవచ్చు. రేవతి, కాజల్ అగర్వాల్, హన్సిక పాత్రలు ఇంట్రస్టింగ్‌గా ఉండడంతో నటించడానికి అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
ఈ విషయం గురించి యూనిట్ వర్గాలు అవునని గానీ, కాదని కానీ నోరు విప్పకపోవడం గమనార్హం. చిత్రం ఈ నెల 27న తెరపైకి రానుంది. ఈ ప్రచారంలో నిజం ఎంత అన్నది అప్పుడే తెలుస్తుంది.