
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీస్వామి చెప్పారు. తన బదులు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వస్తారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తన తండ్రి విగ్రహ ప్రారంభానికి రాకుండా తనను అవమానించారని నటుడు ప్రభు ఇటీవల రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కే రాజుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం నేరుగా ప్రభుకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. తాను రాలేకపోవడానికి కారణాలు వివరించారు.
'గణేశన్ మెమోరియల్‌ను స్వయంగా ప్రారంభించాలని నాకు ఆశగా ఉంది. అయినప్పటికీ ముందుకు ఖరారు అయిన కొన్ని కార్యక్రమాల కారణంగా నేను ఆరోజు అందుబాటులో ఉండటం లేదు. అందుకే, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రారంభోత్సవానికి వస్తారు' అని పళనీ స్వామి చెప్పారు. అక్టోబర్ 1 శివాజీ గణేశన్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. గతంలో ఆయన విగ్రహం చెన్నైలోని కామరాజర్ సాలయ్ వద్ద ఉండేది. అయితే, ప్రజల సౌకర్యం రీత్యా వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో తిరిగి రూ.2.80కోట్ల వ్యయంతో ఆద్యార్ ప్రాంతంలో పూర్తిగా ద్రవిడియన్ పద్థతిలో నిర్మించారు.