అన్నాడీఎంకే పార్టీలో మూడేళ్ల తర్వాత కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ సంకేతాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు, పళని ఇవ్వడంతో నేతల్లో కలవరం నెలకొంది. మార్పు అనివార్యం అని స్వయంగా పళని, పన్నీరు ప్రకటించారు. ఈ నెల 24న అమ్మ జయంతి రోజున ఆయా ప్రాంతాల్లో నేతలు సేవా కార్యక్రమాలు చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు.
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేను రక్షించుకునేందుకు సీఎం పళనిస్వామి తీవ్రంగానే ప్రయత్నించారు. బయటకు వెళ్లిన పన్నీరుసెల్వంను మళ్లీ పార్టీలోకి రప్పించారు. అధికారంలో, పార్టీలో ఇద్దరు సమం అన్నట్టుగా సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడిగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పన్నీరు సెల్వం ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాలన మూడేళ్లు విజయవంతం కావడంతో నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన పళనిస్వామి ఇక మార్పులు చేర్పులపై దృష్టి పెట్టడం అన్నాడీఎంకే నేతల్లో కలవరం రేపుతున్నాయి. చదవండి: ‘బ్రదర్ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు'
మార్పులు చేర్పుల దిశగా..
తొలుత పన్నీరు రూపంలో ఆ తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. అయినా అందరినీ కలుపుకుని వెళ్లడంతో చాలా మంది మళ్లీ మాతృగూటికి వస్తున్నారు. ప్రజల్లో తనకు చరిష్మా ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పళనిస్వామి చాటుకున్నారు. అదే ఊపుతో పురపాలక, కార్పొరేషన్లు, పట్టణ పంచాయతీలు, వాయిదా పడ్డ తొమ్మిది జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం లక్ష్యంగా దూకుడు పెంచారు. ఈ పరిస్థితుల్లో నాలుగు రోజుల పాటుగా జిల్లాల వారీగా పార్టీ వర్గాలతో పన్నీరు, పళని భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అనేక జిల్లాల కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై జిల్లాల నుంచి వచ్చిన నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పళని, పన్నీరు మార్పు అనివార్యం అని ప్రకటించడం గమనార్హం. చదవండి: శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం
ప్రకటనతో కలవరం..
మంగళవారం పన్నీరు, పళని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో నాలుగైదు రోజుల పాటుగా సాగిన జిల్లాల నేతల సమావేశం గురించి వివరించారు. ఇందులో అనేక అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. బలోపేతం, రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రతిజ్ఞ చేద్దామని, అంకిత భావంతో, ఐక్యతతో పనిచేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన సూచనలు, సలహా పాటించే దిశగా ప్రతి ఒక్కరూ హామీలు ఇచ్చారని పేర్కొంటూ, అదే సమయంలో తమ దృష్టికి తెచ్చిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మార్పులు చేర్పుల దిశగా ముందుకు సాగబోతున్నామన్నారు. ఎంజీఆర్, అమ్మ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. కాగా అనేక మంది మంత్రులు, జిల్లా నేతలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎవరి పదవులు ఊడుతాయో? ఎవరికి పదవులు వరిస్తాయో? అన్న చర్చ అన్నాడీఎంకేలో జరుగుతోంది.
సేవల్లో..
దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నిర్ణయించింది. హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని కేడర్‌కు పిలుపునిచ్చింది. అలాగే జయంతి రోజున రాయపేటలోని పార్టీ కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment