$1,000 ఐఫోన్ లాంచైతే ఆపిల్ ఎక్కడికో...
శాన్ ఫ్రాన్సిస్కో : ఆపిల్ సరికొత్త ఐఫోన్ పై ఇప్పటికే లెక్కలకు మించిన అంచనాలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ను ఈ ఏడాదే 1000 డాలర్ల ధరకు ఆపిల్ లాంచ్ చేయనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. రిపోర్టులకు అనుగుణంగా నిజంగానే తర్వాతి తీసుకురాబోతున్న ఐఫోన్ 1000 డాలర్లకు మార్కెట్లోకి వస్తే, ఈ టెక్ దిగ్గజం ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా ఎగియనుందట. సుమారు 900 బిలియన్ డాలర్లకు అంటే 57,75,795 కోట్లకు ఈ దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండనున్న తొలి కంపెనీగా కూడా ఆపిలే అవతరించనుందని తెలుస్తోంది.
1000 డాలర్ల ఐఫోన్ ను ఆపిల్ ఈ సెప్టెంబర్ లో ఆవిష్కరించనున్నట్టు సమాచారం. ఇది సగటు విక్రయ ధరకు, గ్రాస్ మార్జిన్లకు ఉపయోగపడి, స్టాక్ విలువను మరింత పైకి ఎగిసేలా చేస్తుందని మార్కెట్ వాచ్.కామ్ రిపోర్టు చేసింది. ఈ నెల మొదట్లో ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 800 బిలియన్ డాలర్లు(రూ.51,34,040కోట్లు)కు చేరింది. ఆపిల్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఉంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 653 బిలియన్ డాలర్లు. తర్వాత మైక్రోసాప్ట్ మూడో స్థానంలో నిలిచింది. 2017 ఆర్థికసంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఆపిల్ 50.8 మిలియన్ ఐఫోన్లను విక్రయించింది. అయితే ఇవి ఏడాది ఏడాదికి ఒక శాతం తక్కువని మే నెలలో కంపెనీ ప్రకటించిన రెండో క్వార్టర్ ఫలితాల్లో తెలిసింది.