జియో నెలవారీ డేటా ట్రాఫిక్ తెలిస్తే షాక్!
జియో నెలవారీ డేటా ట్రాఫిక్ తెలిస్తే షాక్!
Published Wed, Apr 26 2017 2:46 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
ముంబై : రిలయన్స్ జియో... ఈ పేరు వింటేనే ఇప్పుడు టెలికాం దిగ్గజ కంపెనీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తూ.. వినియోగదారులకు డేటా సర్వీసుల వర్షం కురిపిస్తోంది. అయితే రిలయన్స్ జియో నెలవారీ డేటా ట్రాఫిక్ ఎంతో తెలిస్తే షాకవుతారు. నెలకు 110కోట్ల జీబీ కంటే ఎక్కువగానే జియో డేటా ట్రాఫిక్ ఉందట. రోజుకు 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలను జియో అందిస్తుందని తెలిసింది. 2016-17 ఆర్థిక సంవత్సర ఫలితాల సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. చరిత్రలోనే ఉచిత సేవలనుంచి పెయిడ్ సర్వీసుల్లోకి మారిన అత్యంత పెద్ద కంపెనీ తమ జియోనేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా, వాయిస్ సర్వీసులను అందిస్తూ.. కస్టమర్లకు అత్యంత నాణ్యత సేవలందించడానికి అంకితభావంతో జియో ముందుకు వెళ్తుందని అంబానీ ప్రకటించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుతో ఈ టెలికాం వ్యాపార సేవలను గతేడాదే లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పటి నుంచి మొన్నటిదాకా అంటే మార్చి ఆఖరి వరకు ఉచిత సేవలను అందించి, ఏప్రిల్ 1 నుంచే టారిఫ్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది ఈ కంపెనీ. తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు, పోస్టు పెయిడ్ కస్టమర్లకు బంపర్ రీఛార్జ్ ఆప్షన్లను అందిస్తోంది. రూ.19, రూ.49, రూ.96, రూ.149, రూ. 309, రూ.509, రూ.999, రూ.1,999, రూ.4,999, రూ.9,999 రీఛార్జ్ ఆప్షన్లను జియో తన వినియోగదారులకు కల్పిస్తూ.. అద్భుతమైన వాయిస్, వీడియో కాలింగ్, డేటా సర్వీసులను అందిస్తోంది.
Advertisement
Advertisement