
స్టీవ్‌జాబ్స్ చెప్పినట్లుగానే..
ప్రపంచ మార్కెట్‌లో ప్రకంపనలు సష్టించిన తొట్టతొలి ఐఫోన్‌ను ఆవిష్కరించి ఈ రోజుకు సరిగ్గా పదేళ్లు
న్యూయార్క్: ప్రపంచ మార్కెట్‌లో ప్రకంపనలు సష్టించిన తొట్టతొలి ఐఫోన్‌ను ఆవిష్కరించి ఈ రోజుకు సరిగ్గా పదేళ్లు. అంటే 2007, జూన్ 29వ తేదీన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ ‘ఓ విప్లవాత్మకమైన ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చిప్పుడు అది అన్నింటిని మార్చేస్తుంది’ అన్నారు. అప్పుడు ఆ మాటలకు అర్థం తెలియలేదు. ఇప్పుడు అక్షరాల అదే జరుగుతోంది. నేడు సమాజంలో సామాజిక సంబంధాలు, విలువలూ అన్నీ స్మార్ట్‌ఫోన్ల విప్లవంతో మారిపోతున్నాయి.
ఒకప్పుడు ముచ్చట్ల కోసం మిత్రులంతా కలసి పార్కుకో, హోటల్‌కో వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు. వీలున్న వారు విహార యాత్రలకు వెళ్లేవారు. సరదాగా గడిపేవారు. ఇప్పటికీ పార్కులకు, హోటళ్లకు, విహార యాత్రలకు వెళుతున్న వారు ఉన్నారు. కాకపోతే ఒంటరిగా, స్మార్ట్‌ఫోన్ తోడుగా. అలా గడిపిన తాలూకు జ్ఞాపకాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. టెలిఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పుడు కుటుంబాలు, బంధుమిత్రులు ముఖాముఖి కలసుకొని మాట్లాడుకోవడం తగ్గిపోయింది. స్మార్ట్‌ఫోన్ల రాకతో మాట్లాడుకోవడం కూడా పడిపోయింది. లిపి సందేశాలను పంపించుకోవడం అలవాటైంది.
ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలైనట్లుగానే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు ప్రజలు బానిసలవుతున్నారని మార్కెటింగ్ ప్రొఫెసర్ ఆడమ్ అట్లర్ ‘ఇర్రెసిస్టిబుల్’ అనే పుస్తకంలో తెలిపారు. అటు మత్తు పదార్థాల విషయంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల విషయంలో మానవ మెదడు ప్రకియ ఒకేలాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన ఈ విషయాన్ని నిరూపించడం కోసం స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో కొంత మందిని ఎంపిక చేసి వారి స్మార్ట్‌ఫోన్లను స్క్రీన్లు కనిపించకుండా టేబుల్‌పై పెట్టించారు. ఫోన్ల నుంచి వారిని దష్టిని మళ్లించేందుకు వారితో మాటలు కూడా కలిపారు. వారంతా అన్యమస్కంగా తమ ఫోన్లనే చూస్తుండి పోయారు. ఫోన్లను చేతుల్లోకి తీసుకొని చూసుకోకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేకపోయారు. అడిక్షనంటే ఇదేనంటూ ఆయన తేల్చారు.
ఫేస్‌బుక్‌ను ఎక్కువ వాడుతున్న వారు తక్కువ సంతోషంతో ఉంటున్నారని పలు అధ్యయనాల్లో ఇప్పటికే తేలింది. ఫేస్‌బుక్‌ను తక్కువగా ఉపయోగిస్తున్న వారే ఎక్కువ సంతోషంతో ఉంటున్నారట. స్మార్ట్‌ఫోన్లను తెగ ఉపయోగించే భార్య భర్తలను ఓ సర్వేలో వారి వైవాహిక సంబంధాల గురించి ప్రశ్నించగా తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు. కొన్ని జంటలు మానసిక ఆందోళనకు కూడా గురవుతున్నాయి. 1980, 1990, 2000, 2010లో పుట్టిన తరాల మధ్య స్మార్ట్‌ఫోన్లలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఎలా ఉన్నాయో, అలాగే ఆ తరాల పిల్లల మధ్య, వారి అలవాట్ల మధ్య ఎంతో తేడాలు ఉన్నాయి. 1995 తర్వాత పుట్టిన తరాన్ని ఐజెన్ లేదా జెన్‌జీ తరం అని పిలుస్తారు. వారు కౌమారత్వాన్ని పూర్తిగా స్మార్ట్‌ఫోన్లతోనే గడిపారు.
2009 నుంచి 2016 సంవత్సరాల మధ్య (స్మార్ట్‌ఫోన్లు ఉండడం సాధారణమైన రోజుల్లో) అమెరికాలో కళాశాలకు వెళ్లే విద్యార్థుల్లో మానసిక ఆందోళన రెండింతలు పెరిగిందని ‘అమెరికన్ ఫ్రెష్ మేన్ సర్వే’ వెల్లడించింది. అదే కాలంలో యువతీ యువకుల ఆత్మహత్యల రేటు కూడా రెట్టింపయిందని ‘ది సెంటర్స్ పర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం వల్ల యువతలో మద్యం సేవించడం గణనీయంగా తగ్గిందని, టీనేజీ సెక్స్ కోసం వెంపర్లాడడం కూడా బాగా తగ్గిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కూడా ఓ పరికరమని, అన్ని పరికరాల్లోలాగానే సానుకూల ఫలితాలతోపాటు ప్రతికూల ఫలితాలు ఉంటాయని స్మార్ట్‌ఫోన్లను తయారుచేసే దిగ్గజ సంస్థలు చెబుతున్నాయి. ఏదేమైనా నేటి ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడకుండా బతికే రోజులు పోయాయనే చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్లు ప్రపంచంలో ప్రతిదాన్ని మార్చేస్తుందని నాడు స్టీవ్ జాబ్స్ అన్నారుగానీ, ఇంతగా మార్చేస్తుందని ఆయనకు కూడా తెలియదు కాబోలు!