నెటిజన్లకి అంధుల విజ్ఞప్తి
ఓ మంచి పనికి సహకారం కావాలని, తమకు నెటిజన్లు అండగా నిలవాలని కోరుతూ అంధులు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అంధులు ఎదుర్కొంటున్న ఓ సమస్యను, అందరం కలిస్తే చాలా సులువుగా పరిష్కరించవచ్చు. ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్టే. ఈ స్మార్ట్ ఫోన్‌ని కళ్లు మూసుకొని కూడా కొన్ని సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో అవలీలగా ఉపయోగించవచ్చు. వీటిలో వాయిస్ ఓవర్ అనే స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఒకటి. ఇది ప్రతి ఆపిల్ ఐఓస్ ప్రాడక్ట్‌లలో అందుబాటులో ఉంది. ఈ వాయిస్ ఆఫ్షన్‌ని ఆన్ చేస్తే స్క్రీన్ మీద కనిపించే ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని స్పష్టంగా పైకి చదివి వినిపిస్తుంది. దీని సహాయంతో అంధత్వాన్ని అతిక్రమించి ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకుంటూ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ రంగంలో అంధులు అద్భుతంగా రాణిస్తున్నారు.
అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అంధులు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడానికి తెలుగు వారందరి సహకారాన్ని కోరుతున్నారు. ఈ వాయిస్ ఓవర్ సహాయంతో కొన్ని ప్రాంతీయ భాషల్లో లభించే సమాచారాన్ని అంధులు చదవలేకపోతున్నారు. వీటిలో తెలుగు భాష కూడా ఉంది. దీంతో స్క్రీన్ పైన కనిపించే తెలుగు పదాలను అంధులు చదవలేకపోతున్నారు. చేంజ్ డాట్ ఓఆర్జీ వెబ్ సైట్ సహాయంతో తమ సమస్యను ఆపిల్ దృష్టికి తీసుకువెళ్లడానికి అంధులు ఓ దరఖాస్తు చేశారు.
అయితే ఈ పిటిషన్ ఆపిల్ స్వీకరించాలంటే కనీసం 5000 మంది ఈ పిటిషన్‌కు మద్దతుగా సైన్ చేయాల్సి ఉంటుంది. మద్దతు తెలపడానికి కేవలం అంధులే కావాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు పరిష్కారం అవసరం అని భావించే ఎవరైనా ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపి అంధుల ఆత్మస్థైర్యానికి అండగా నిలిచే అవకాశం ఉంది.
కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మొదటిపేరు, చివరి పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి సైన్ బటన్ ప్రెస్ చేస్తే చాలు.
https://www.change.org/p/
మరింత సమాచారం కోసం కింది వీడియోను వీక్షించండి