వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లకు వార్నింగ్
వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లకు వార్నింగ్
Published Fri, Apr 21 2017 8:42 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
వారణాసి : వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేస్తూ గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్న వారు ఇక నుంచి చాలా అప్రమత్తతగా ఉండాల్సి ఉంది. అడ్మిన్గా కేవలం గ్రూప్లో కొత్త సభ్యులను చేర్చడం మాత్రమే కాకుండా.. గ్రూప్లో పోస్టు అయ్యే వాటిపైనా ఓ కన్నేసి ఉండాలట. లేకపోతే గ్రూప్ సభ్యులు చేసే అనవసరమైన తప్పిదానికి వీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. గ్రూప్లో పోస్టు చేసే రూమర్లకు, ఫేక్ న్యూస్ స్టోరీలకు లేదా అసహ్యకరమైన వీడియోలకు గ్రూప్ అడ్మిన్లు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని వారణాసి కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తప్పుడు వార్తలకు, మార్పుడ్ ఫోటోగ్రాఫ్లకు, అభ్యంతరకరమైన వీడియోలకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారనే ఆరోపణల మేరకు స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది.
గ్రూప్లో ఇతర యూజర్లు పోస్టు చేసిన కంటెంట్కు గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టిస్తూ వచ్చే పోస్టులకు గ్రూప్ అడ్మిన్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేస్తామని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు కలిసి తమ అభిప్రాయాలను, ఫోటోలను, తమకు నచ్చిన వీడియోలను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లు గ్రూప్ను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించాయి. వారణాసి ప్రభుత్వ ఆర్డర్తో సోషల్ మీడియా గ్రూప్ను క్రియేట్ చేసే అడ్మిన్లే ఇక నుంచి అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదైనా తప్పుడు వార్తను, అభ్యంతరకరమైన పోస్టులను గ్రూప్ సభ్యులు పెడితే, వెంటనే ఆ పోస్టుల తొలగించి, గ్రూప్ నుంచి ఆ సభ్యుడికి ఉద్వాసన పలకాలని ఆదేశించింది.
Advertisement