నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,416 ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఈ పోస్టులు భర్తీ కావొచ్చన్నారు. మాల్తుమ్మెద ఉన్నత పాఠశాలలో మంగళవారం పలు పాఠశాలల హెచ్‌ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించి సూచనలిచ్చేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనతీరు, బోధనోపకరణాల వినియోగం, పరీక్షల నిర్వహణపై ప్రత్యేకమైన ఫార్మాట్‌ను రూపొందించామని, దీనిని ఉపాధ్యాయులే పూరించి ప్రధానోపాధ్యాయుడికి సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ ఫార్మాట్‌ను హెచ్‌ఎం తనిఖీచేసి మండల విద్యావనరులకేంద్రానికి పంపుతారన్నారు. అక్కడ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీలకు ఆయా మండల కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ తెలిపారు. 1, 2తరగతులకు సంబంధించి తెలుగు, గణితం సబ్జెక్టులపై, 3, 4, 5 తరగతులకు సంబంధించి ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్టుపై మూడు రోజుల చొప్పున శిక్షణ ఉంటుందన్నారు.
జిల్లాలో గతేడాది పదో తరగతి పరీక్షల్లో 89.31 శాతం ఉత్తీర్ణులయ్యారని, ఈసారి వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో సాగుతున్నామని డీఈఓ తెలిపారు. జిల్లాలో 566 పాఠశాలల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగవచ్చన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేస్తామన్నారు. అనంతరం ఆయన గోపాల్‌పేట ఉన్నత పాఠశాలను, మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, మాల్తుమ్మెద, గోపాల్‌పేట, ఆత్మకూర్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు ప్రతాప్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, అరుణజ్యోతి ఉన్నారు.
1,416 టీచర్ పోస్టులు ఖాళీ
Published Wed, Oct 22 2014 3:28 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement