ధారూర్: ఉపాధి కూలీ పనులు తీసుకోవడానికి బ్యాంక్‌కు వచ్చిన వ్యక్తి బ్యాంక్ మొదటి అంతస్థు పై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ ఎస్‌బీహెచ్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌బీహెచ్‌లో శనివారం ఉపాధి హామీ పథకం డబ్బులు ఇస్తున్నారనే సమాచారంతో 12 గ్రామాలకు చెందిన కూలీలు బ్యాంక్ ఎదుట బారులు తీరారు.
దీంతో బ్యాంక్ సిబ్బంది బ్యాంక్‌కు తాళాలు వేసి కిటికి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. పలుమార్లు తోపులాట జరిగింది. రేలింగ్‌కు ఆనుకొని నిలబడి ఉన్న దోర్నాల్ తండాకు చెందిన హరిచంద్ అనే వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.