అతడిపై పది కేసులు..! | 10 cases on | Sakshi
Sakshi News home page

అతడిపై పది కేసులు..!

Published Wed, Dec 10 2014 12:26 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

అతడిపై పది కేసులు..! - Sakshi

అతడిపై పది కేసులు..!

5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి
ఆ వ్యక్తిపై 10 కేసులున్నట్లు పోలీసుల వెల్లడి
చీటింగ్, యువతులను నమ్మించి
పెళ్లి చేసుకోవడం వెంకట్‌రావు ప్రవృత్తి..

 
శంషాబాద్ రూరల్: పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. ఆ తర్వాత మోసం చేయడం అతని ప్రవృత్తి.. ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడిం చారు. సీఐ ఉమామహేశ్వర్‌రావు తెలిపిన వివరాలు .. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకట్‌రావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో పెళ్లి జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు.

జల్సాలకు అలవాటు పడిన వెంకట్‌రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతి కుటుంబాన్ని తీసుకుని తీర్థ యాత్రలకు వెళ్లి వారికి తనపై మంచి అభిప్రాయం ఏర్పడేలా నమ్మిస్తాడు. తర్వాత యువతిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సంసారం సాగిస్తాడు. తర్వాత మరో యువతిని వలలో వేసుకుంటాడు. ఇలా యువతులను ప్రలోభపెట్టి  వ ంచించడం వంటి 10 కేసుల్లో వెంకట్‌రావు నిందితుడు. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై కేసు నమోదయింది.
 
పోలీసుల కళ్లుగప్పి..

ఓ కేసులో ఈ ఏడాది జూలై 1న కడప సెంట్రల్ జైలు నుంచి ఇతన్ని ఒంగోలు కోర్టుకు తీసుకెళ్తున్నారు. కడప బస్టాప్‌లో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనలో నలుగురు ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులను ఓ సారి బస్సులో ప్రయాణిస్తూ పరిచయం చేసుకున్నాడు. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని, అందుకు డబ్బులు తీసుకుని రావాలని ఈ ఏడాది సెప్టెంబరు 18న ఈ దంపతులను అక్కడికి రప్పించాడు. అక్కడ వారిని బెదిరించి తులసి వద్ద బంగారు నగలు, వారి షిఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీంతో తులసి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయింది.

ప్రమాదానికి ముందు..
ఔటర్‌పై జరిగిన ప్రమాదానికి ముందు ఇతను ఓ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి తనతో పెట్టుకున్నాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతంలోని తిరుపతమ్మ ఆలయం వద్ద ఉండే ఉపాధ్యాయుడు నాగేశ్వర్‌రావుకు కొన్ని గదులు ఉన్నాయి. వెంకట్‌రావు ఈ ఆలయానికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో అతను నాగేశ్వర్‌రావుకు చెందిన గదుల్లో అద్దెకు ఉండేవాడు. అతనితో పరిచయం పెంచుకున్న వెంకట్‌రావు షిరిడి టూర్ ప్లాన్ చేశాడు. సంజీవరావు నుంచి లాక్కున్న షిఫ్ట్ కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు.

నాగేశ్వర్‌రావుతో పాటు అతని భార్య సురేఖ, కూతురు సుశ్వేత, మేన కోడలు రత్నకుమారి, తనతో ఉండే యువతిని తీసుకుని వెంకట్‌రావు  ఈ నెల 2న ఇదే కారులో షిరిడి వెళ్లాడు. అక్కడి నుంచి 4న తిరుగు ప్రయాణంలో పెనుగంచిప్రోలు వెళ్లడానికి శంషాబాద్‌లోని ఔటర్ మీదుగా వస్తున్నారు. 5న తెల్లవారుజామున పెద్దగోల్కొండ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొంది. డ్రైవింగ్ చేస్తున్న వెంకట్‌రావు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. ఈ నెల 6న అతని మృతదేహాన్ని అక్క రమణమ్మకు అప్పగించారు. అనంతరం దర్యాప్తు జరపగా కడప జైలులోని రికార్డుల్లో నమోదైన ఆనవాళ్ల ఆధారంగా మృతదేహం వెంకట్‌రావుదని నిర్ధారించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement