సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ఉపాధి హామీ కూలీలకు ధీమాను కల్పిస్తోంది. వచ్చేనెలలో చేపట్టనున్న ఐదో విడత హరితహారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. తద్వారా ఉపాధి కూలీలకు తగినంతగా పనులు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పథకం కింద కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో వాటి సంరక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
కిలోమీటరు దూరానికి ఒక్కో ఉపాధి కూలి...
ఐదో విడతలో దాదాపు 10 లక్షల మంది ఉపాధి కూలీలకు మొక్కల పెంపకంలో వందరోజుల పనిదినాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల వ్యవసాయ భూముల్లో నాటే ఒక్కో మొక్కకు నెలకు రూ.5 వంతున ఇచ్చి వాటి సంరక్షణకు బాటలు వేయాలని నిర్ణయించారు.. రహదారి వెంట నాటిన మొక్కల రక్షణకు ఒక్కో ఉపాధి కూలీకి కిలోమీటరు దూరం చొప్పున బాధ్యతలు అప్పగించి, రోజుకు రూ. 211 సగటు వేతనంగా చెల్లిస్తారు. మొక్కల పెంపకంతో ఉపాధి కూలీలకు కావాల్సినంత పని కల్పించడంతో పాటు హరితహారం లక్ష్యాన్నీ సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతదాకా 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.2 లక్షల మంది కూలీలకు పని కల్పించారు, ఈ ఏడాదికి గాను 12 కోట్ల పని దినాల కల్పనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలో ఎక్కువ పని రోజులు కల్పించిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం పని రోజులను పెంచింది. 2019–20 లో భాగంగా జూన్ 4వ తేదీ వరకు 5.7 కోట్ల పని దినాలు రూ. 147 సగటు వేతనంతో పని కల్పించి, మొత్తం రూ. 947.2 కోట్లు వెచ్చించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత ఆర్థిక సంవత్సరంలోనే అ«ధిక పనులు చేసిన రికార్డు రాష్ట్రంలో నమోదైంది.గతేడాది కూలీలకు రూ. 148.4 సగటు వేతనంతో 11.2 కోట్ల పని దినాలు కల్పించారు. 25.2 లక్షల కుటుంబాలకు చెందిన 42.4 లక్షల మంది కూలీలకు పని దొరికింది. రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. కూలీలకు వేతనాలుగా రూ. 1706.1 కోట్లు, రూ. 1042.9 కోట్లు పరికరాల కోసం కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment