సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలతో భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఆహ్లాదకరంగా మార్చే లక్ష్యాలతో హరితహారం అమలవుతోంది. రాష్ట్రాన్ని పర్యావరణహితంగా మలచుకోవాలనే ఆకాంక్షలోంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం ఐదు విడతలు పూర్తి చేసుకుని, ఆరవ విడతలోకి అడుగుపెడుతోంది. ఇందులో ప్రజలంతా పాల్గొని మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో కేసీఆర్ మొక్కలు నాటి ఆరో విడత హరితహారాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి పెరుగుతుండటంతో ఈ కార్యక్రమం కొనసాగింపులో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించడంతోపాటు నాటే ఒక్కో మొక్క దగ్గర ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తుల మధ్య ఆరడుగుల దూరాన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ జిల్లాలోని నర్సరీలు, వాటిల్లో లభిస్తున్న మొక్కల సంఖ్య, రకాలు, ఆయా నర్సరీల సమాచారంతో డైరెక్టరీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ ఏడాది దాదాపు 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విడత హరితహారం ప్రత్యేకతలు...
► జంగల్ బచావో.. జంగల్ బడావో (అడవిని కాపాడుదాం.. అడవిని విస్తరిద్దాం) నినాదం.
► వర్షాలకు అనుగుణంగా జిల్లాల్లో కొనసాగింపు.
► టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం.
► ప్రతీ జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచటం. ► హెచ్‌ఎండీఏ పరిధిలో 5 కోట్లు, జీహెచ్‌ఎంసీలో 2.5 కో ట్లు. మిగతా పట్టణప్రాంతాల్లో 5 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం
► పట్టణ ప్రాంతాలకు సమీప అడవుల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు.
► స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, కేంద్ర సంస్థల్లో హరితహారం.
► ప్రతీ ఊరికో చిన్న పార్కు ఏర్పాటు.
► ప్రతీ నియోజకవర్గంలో ఉన్న అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు విధులు
► ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వడం, బాధ్యతగా పెంచేలా పంచాయతీల పర్యవేక్షణ.
► కోతుల బెడద నివారణకు 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళిక.
► గత ఐదు విడతల్లో నాటిన ప్రాంతాల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి మార్పు చేయటం.
► ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత, రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపు.
► కేంద్ర ప్రభుత్వ వెదురు ప్రోత్సాహక సంస్థ సహకారంతో చిన్న, సన్నకారు రైతుల్లో వెదురు పెంపకానికి ప్రోత్సాహం.
► హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేక హరితహారం. 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధి.
► హైవేలు, రాష్ట్ర రహదారుల వెంట 30 కిలోమీటర్లకో నర్సరీ.
జంగల్ బచావో.. జంగల్ బడావో!
Published Thu, Jun 25 2020 5:02 AM | Last Updated on Thu, Jun 25 2020 5:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment