14.7 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత | 14.7kilograms gold biscuits caught in khajipet | Sakshi
Sakshi News home page

14.7 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత

Published Fri, Apr 17 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

14.7 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత

14.7 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత

  • వీటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా
  • కాజీపేట: వరంగల్ జిల్లాలోని కాజీపేట జంక్షన్‌లో బిస్కెట్ల రూపంలో ఉన్న 14 కిలోల 700 గ్రాముల బంగారాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ)  పట్టుకున్నారు. కాజీపేట జీఆర్‌పీ సీఐ ఎ.మధుసూదన్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై క్రైం పోలీసులు, జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ హసీనాబేగం, వెంకటమల్లు, మధు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని బజ్జూరి బులియన్ దుకాణానికి చెందిన గుమస్తాలు పట్టూరి వీరేశం, నాగబండి ఉపేందర్ సికింద్రాబాద్ నుంచి సిర్‌పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ దిగి బయటికి వెళ్తున్నారు. రెండు  బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. బ్యాగుల్లో ప్యాకింగ్‌లో ఉన్న 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
     
    ఇవి ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.  ఈ బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బజ్జూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది.  బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చలానాలో ఉందని, కానీ కాజీపేటలో పట్టుకున్న బంగారం 14.700 కిలోలు మాత్రమే ఉందన్నారు. మిగతా బంగారం హైదరాబాద్‌లో వేరే వారికి ఇచ్చామని దాన్ని తరలిస్తున్న వ్యక్తులు చెప్పినట్లు సీఐ వెల్లడించారు. పట్టుబడిన బంగారం, కాగితాలలో తేడా ఉండడంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి, బంగారాన్ని సీజ్ చేసి పంచనామా చేసి కమర్షియల్ టాక్స్, ఐటీ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. కాగా, విలువైన బంగారం బిస్కెట్లను  హైదరాబాద్ నుంచి రైల్లో తీసుకువస్తున్న వారు తప్పకుండా భద్రత పాటించాలని జీఆర్‌పీ సీఐ మధుసూదన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement