సాక్షి, నల్గొండ : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నల్లగొండ సిండికేట్ బ్యాంకులో రుణం పొంది ఫరంలోని మరో ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేసి ఇద్దరు కేటుగాళ్లు బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్లితే తిరుమలగిరి మండలంలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ మండల అధ్యక్షుడు శాగం రాఘవరెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన నాగేండ్ల కృష్ణారెడ్డితో పాటు మరో ఏడుగురు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఒక ఫరంగా ఏర్పడ్డారు. వీరంతా హాలియాలోని బస్టాండ్ సమీపంలోని మహావీర్ కాంప్లెక్స్ పేర నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. మహావీర్ కాంప్లెక్స్ బిల్డింగ్ నిర్మాణానికి 2014–15లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిండికేట్ బ్యాంకులో రూ. 2కోట్ల రుణం పొందారు.
అయితే మహావీర్ కాంప్లెక్స్ ఫరంలోని శాగం రాఘవరెడ్డి, నాగేండ్ల కృష్ణారెడ్డి, కాంసాని సాంబ శివారెడ్డి, మల్లు కృష్ణారెడ్డి పేరిట జాయింట్ ఖాతాను తెరిచి చెక్‌బుక్ తీసుకున్నారు. సిండికేట్ బ్యాంకు నుంచి జాయింట్ ఖాతాలోకి రూ. 2కోట్లు జమ అయిన విషయం తెలుసుకున్న శాగం రాఘవరెడ్డి, నాగేండ్ల కృష్ణారెడ్డి మిగిలిన మరో ఇద్దరి సభ్యుల సంతకాలను చెక్కుల మీద ఫోర్జరీ చేసి రూ. 1.30 కోట్లు డ్రాచేశారు. ఈక్రమంలో మహావీర్ కాంప్లెక్స్ కన్‌స్ట్రక్షన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న విషయంలో మల్లు కృష్ణారెడ్డికి శాగం రాఘవరెడ్డి, నాగేండ్ల కృష్ణారెడ్డికి గొడవ జరిగింది. దీంతో మల్లు కృష్ణారెడ్డి సిండికేట్ బ్యాంకుకు వెళ్లి జాయింట్ ఖాతాలో ఉన్న డబ్బు ల వివరాలపై మేనేజర్ వద్ద ఆరా తీశారు.
జాయింట్ ఖాతాలో నిల్వ ఉన్న రూ. 2 కోట్ల నుంచి రూ.1.30 కోట్లు డ్రా అయినట్లు వెలుగులోకి రావడంతో సదరు పార్ట్‌నర్ మల్లు కృష్ణారెడ్డి బ్యాంకు మేనేజర్‌ను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహావీర్ కాంప్లెక్స్ పేరా బ్యాంకులో రూ. 2కోట్లు రుణం పొంది ఫరం సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసిన వారిపై బ్యాంకు మేనేజర్ ఐదేళ్ల క్రితం కేసు పెట్టారు. చెక్కు ఫోర్జరీ కేసు విషయంలో చెక్కులను హెదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతో సంతకాలు ఫోర్జరీ అయిన విషయాన్ని నిపుణులు తేల్చడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శాగం రాఘవరెడ్డి అరెస్టు చేయగా నాగేండ్ల కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment