లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు! | 2019 Lok Sabha Election Nalgonda Politics | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు!

Published Fri, Feb 1 2019 7:59 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

2019 Lok Sabha Election Nalgonda Politics - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఈవీఎం మొదటి దశ తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. అందుకు సంబంధించి బెంగళూరు నుంచి బెల్‌ కంపెనీకి చెందిన 16మంది ఇంజనీర్లు వచ్చారు. శుక్రవారం రాజకీయ పక్షాల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేయనున్నారు. నల్లగొండ పార్లమెంట్‌ స్థానం పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడతోపాటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15,01,209 మంది ఓటర్లు ఉండగా, 1,861 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మే మాసంలో నిర్వహించే   పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించింది. జనవరి 25 వరకు ఓటు నమోదు, చేర్పులు, మార్పులు కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్ని ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకూ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నెల 22న తుది జాబితా
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న ఓటర్ల జాబితా ముసాయిదా నమోదు కార్యక్రమం ఈ నెల 4న ముగియనుంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి  22న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు నమోదుపై అవగాహన కల్పించనున్నారు. 3వ తేదీన బీఎల్‌ఓలు పోలింగ్‌ స్టేషన్లలో ఫాం–6తో అందుబాటులో ఉండాలని ఎన్నికల అధికారులు నిర్ణయించి ప్రత్యేక క్యాంపులు పెట్టారు.

నేటినుంచి ఈవీఎం చెకప్‌
బెంగళూరులోని బెల్‌ కంపెనీ (భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌) కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈవీఎంలను సరఫరా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని మొదటి విడత చెకప్‌ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. శుక్రవారంనుంచి వాటిని మొదటి లెవల్‌ తనిఖీ చేసి క్లియర్‌ చేసేందుకు 16 మంది ఇంజనీర్లు వచ్చారు. వీరంతా అసెంబ్లీకి ఉపయోగించిన ఈ ఈవీఎంలలో ఉన్న డేటాను రాజకీయ పక్షాల ఎదుట క్లియర్‌ చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఈవీఎంలు 2,531 ఉండగా కంట్రోల్‌ యూనిట్లు 1,909, వీవీ ప్యాట్లు 2,044 ఉన్నాయి.

పెరగనున్న పోలింగ్‌ స్టేషన్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 198 పోలింగ్‌ కేంద్రాలు పెరగనున్నాయి. అందుకు సంబంధించి డిసెంబర్‌ మాసంలోనే జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ప్రక్రియ ముగిసేందుకు ఆలస్యమవడంతో దాన్ని అధిగమించేందుకు పోలింగ్‌స్టేషన్లు పెంచాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో 1200 మంది ఓటర్లు ఉండగా దాన్ని 1100లకు కుదించారు. అదే విధంగా మున్సిపాలిటీల్లో 1400 ఓటర్లు ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో ఉంటే దాన్ని 1200కు కుదించి పోలింగ్‌ స్టేషన్లు పెంచాలని నివేదికలు పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement