సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంబర్ పేట నియోజకవర్గం పరిధిలోలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా, గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని ధూల్‌పేట్ టక్కరివాడిలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని గాంధీకి తరలించారు. నెగిటివ్ వచ్చిన 16 మందిని డిశ్చార్జి చేశారు. కొత్తగా మరో 35 మంది అనుమానితులు ఆస్పత్రిలో చేరారు. ఇక ఆయుర్వేద ఆస్పత్రిలోని పది మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని గాంధీకి తరలించారు. కొత్తగా మరో నలుగురు అనుమానితులు వచ్చారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో ఏడుగురు అనుమానితులు రాగా ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రేటర్‌లో మృతుల సంఖ్య 47కు పెరిగింది.
తల్లిద్వారా కుమారుడికి..
ఎల్‌బీనగర్: ఎల్‌బీనగర్ సర్కిల్–3 పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని ఈ– సేవా సమీపంలో నివాసముండే ఓ వృద్దురాలికి(71) ఈ నెల 22న కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయితే. అయితే తాజాగా ఆదివారం ఆమె కుమారుడికి(40) కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ గాంధీలో చికిత్స తీసుకుంటున్నారు.
తగ్గినట్లే తగ్గి..
ఎల్‌బీనగర్ జోనల్ పరిధిలో కరోన పాజిటివ్ కేసులు గత 10 రోజుల నుంచి తగ్గినట్లే తగ్గి తిరిగి ఏదో ఒక కాలనీలో పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లలో పెరిగిన కరోన పాజిటివ్ కేసుల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మిగతా వారందరూ కోలుకున్నారు. ఇక కేసులు తగ్గాయని అధికారులు, కాలనీ ప్రజలు అనుకుంటున్న తరుణంలో తిరిగి కరోన పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు.
మాతృశ్రీనగర్‌లో దంపతులకు...
హఫీజ్‌పేట్: కరీంనగర్ జిల్లా నుంచి నగరానికి వచ్చి ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించకున్న భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వారిద్దరు తమ సమీప బంధువు మియాపూర్‌లోని మాతృశ్రీ నగర్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉన్నారు. వారు ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సమీపబందువుకు కూడా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. అపార్ట్‌మెంట్‌లోని వాచ్‌మెన్ దంపతులను కూడా వైద్య పరీక్షల కోసం నేచర్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు.
గోషామహల్‌లో మరో రెండు ..
అబిడ్స్: గోషామహల్ 14వ జోన్ పరిదిలో మరో రెండు కరోనా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ధూల్‌ఫేట టక్కరివాడిలో నివసించే ఓ మహిళ (54)తో పాటు ఆమె కుమారుడి(23)కి కరోనా సోకింది. వారిద్దరిని వైద్యాధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులందరినీ హోం క్వారంటైన్ చేశారు.
అంబర్‌పేటలో నలుగురికి..
కాచిగూడ: అంబర్‌పేట నియోజవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నాలుగు కరోన పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాచిగూడ డివిజన్‌లోని మోతిమార్కెట్‌లో ఒక్కటి, బాగ్‌అంబర్‌పేట డివిజన్ సురాబ్‌నగర్ బస్తీలో 2, నల్లకుంట డివిజన్ ఇందిరానగర్‌లో ఒక్కటి కరోన పాజిటివ్ కేసులు రావడంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. మోతీమార్కెట్ ప్రాంతాన్ని గ్రేటర్ అధికారులు శానిటైజ్ చేయించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, ప్రభుత్వ సూచనలను, నిబంధనలను పాటిస్తూ కరోన వైరస్‌ను దైర్యంగా ఎదుర్కొవాలని డీఎంసీ వేణుగోపాల్, కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా సూచించారు.
ఊపిరి పీల్చుకున్నచిలకలగూడ పోలీసులు
చిలకలగూడ : కరోనా బాధిత ఎస్‌ఐతో సన్నిహితంగా మెలిగిన 35 మందికి నిర్ధారణ పరీక్షల్లో కరోనా లేదని తేలడంతో చిలకలగూడ ఠాణా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత ఎస్‌ఐ కుటుంబసభ్యులు, అపార్ట్‌మెంట్‌వాసులతోపాటు చిలకలగూడ ఠాణాకు చెందిన పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లను పద్నాలుగు రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. చిలకలగూడ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. సదరు ఎస్‌ఐ వారాసిగూడ చెక్‌పోస్ట్ ఇంచార్జీగా వ్యవహరించడంతోపాటు 385 మంది వలస కార్మికులను రైళ్లలో స్వస్ధలాలకు పంపేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో సదరు ఎస్‌ఐ కరోనా బారిన పడినట్లు భావిస్తున్నారు.
ఎస్‌ఐకు పాజిటివ్ రావడంతో అతనితో సన్నిహితంగా మెలిగిన 35 మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లతోపాటు ఎస్‌ఐ కుటుంబసభ్యుల నుంచి రక్తనమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అందిన నివేదికలో అందరికీ కరోనా నెగిటివ్ రావడంతోఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌ఐ నివసించే అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో సోడియం హైడ్రాక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశామని, కుటుంబసభ్యులు, అపార్ట్‌మెంట్‌వాసులను హోంక్వారంటైన్‌లో ఉంచామని జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిన 35 మంది పోలీసులు, కానిస్టేబుళ్లకు హోంక్వారంటైన్ ఉండాలని వైద్యులు సూచించారని ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment