
3లైన్లకు రూ.48 కోట్లే.. ప్చ్..!
బడ్జెట్ రైలు ఈ ఏడాది కూడా జిల్లాలో ఆగలేదు. కొత్త రైళ్లు వస్తాయని, నిజామాబాద్ లైన్ పూర్తవుతుందని, రాజధానికి రైలు సౌకర్యం కలుగుతుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూడు లైన్లకు కేవలం రూ.48 కోట్లు ఈ బడ్జెట్‌లో మంజూరయ్యాయి. ఈ నిధులతో పాత ప్రాజెక్టులు అంగుళం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు.
సాక్షి, కరీంనగర్ : దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే లైన్ల నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు ప్రతీసారి అన్యాయమే జరుగుతోంది. ఈసారీ అదే జరిగింది. ముందు చెప్పినట్టే.. ఎలాం టి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని రైల్వే మంత్రి మూడు పాత ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించి మమ అనిపించారు. కేటాయించిన నిధులతో ఏ ప్రాజెక్టు కూడా కనీసం 5 శాతం పూర్తికాని పరిస్థితి. పైగా అవసరాన్ని బట్టి చార్జీల మోత తప్పదని లోక్‌సభలో మంత్రి స్పష్టం చేయడంతో సమయం, సందర్భం లేకుండా రైలు చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం పడనుంది.
కేటాయింపులివీ...
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణంపై సర్వే కోసం రూ.10 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన ఈ లైన్ నిర్మాణమైతే కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. గత ఆర్థిక బడ్జెట్‌లో అప్పటి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈసారి రూ.10 కోట్లే కేటాయించడంతో సర్వే పనులైనా జరుగుతాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌కు రూ.3 కోట్లు కేటాయించారు. 1982లోనే.. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గు గనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు (ఘన్‌పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోగా ఈసారి రూ.3 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు ఇటీవల రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు.
పెద్దపల్లి-నిజామాబాద్ లైన్‌కు ఈసారి రూ.35 కోట్లు కేటాయించారు. ఈసారైనా రైలు ఇందూరుకు చేరుతుందని ఆశించిన జిల్లా ప్రజలకు ఈ బడ్జెట్ కేటాయింపుతో నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితమే అప్పటి రైల్వేమంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వేలైన్‌ను ఆ ఏడాది పూర్తికానున్న లైన్ల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పూర్తికాలేదు. పెద్దపల్లి వయా కరీంనగర్, జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు లైన్ పూర్తిగా కాగా, మోర్తాడ్ నుంచి నిజామాబాద్ వరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రూ.35 కోట్లతో లైన్ ఎంతదూరం వెళ్తుందో మంత్రికే తెలియాలి.
జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడేలా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్-హసన్‌పర్తి వరకు కొత్త లైన్ వేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గతంలో పలుమార్లు సమర్పించిన ప్రతిపాదనలను మోడీ సర్కార్ బుట్టదాఖలు చేసింది. పలు స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ విషయంలోనూ రైల్వేమంత్రి జిల్లావాసులను నిరాశపరిచారు. రామగుండం రైల్వేస్టేషన్లో.. చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్‌ఫాస్ట్, నవ్‌జీవన్, జైపూర్, స్వర్ణజయంతి, పెద్దపల్లిలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్‌ఫాస్ట్ రైళ్ల నిలుపుదల విజ్ఞప్తులను పెడచెవినపెట్టారు.
కమిటీ పేరిట లింకు
కేటాయించిన ఈ అరకొర నిధులు కూడా ఖర్చు చేయకుండా కేంద్రం మెలిక పెట్టింది. సమైక్యంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయని.. రెండుప్రాంతాల్లో మొత్తం 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్న మంత్రి వీటిపూర్తి కోసం రూ.26,680 కోట్లు అవసరమున్నట్లు అంచనా వేశారు. ఈ రెండు ప్రాంతాల్లో రైల్వే అభివృద్ధికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో జిల్లాకు ఇప్పుడు ప్రకటించిన నిధులైనా వస్తాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేలో ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులతో కలిపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) వ్యవస్థ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ప్రకటించడంపైనా ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవస్థతో రైల్వే ఏమాత్రం అభివృద్ధి చెందే ప్రసక్తే లేదని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. గతంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వాలు వెనుకడుగు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాకు రైల్వే నిధుల కేటాయింపు కేవలం కంటితుడుపు చర్యగా ఉన్నాయన్నారు.