తెలంగాణ క్రైస్తవులకు 3 శాతం కోటా
రిజర్వేషన్ల శాతం పెంచుకుంటాం: కేసీఆర్
తమిళనాడు తరహా ప్రత్యేక మినహాయింపులు పొందుతాం
వచ్చే మార్చిలో క్రైస్తవులకు ఎమ్మెల్సీ..
క్రిస్మస్ సందర్భంగా అధికారికంగా ప్రత్యేక కార్యక్రమం
చర్చిలకు నిధులపై పరిశీలన.. ప్రత్యేకంగా స్మశానాలు
మత ప్రచారకులపై దాడులు జరగకుండా ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్:తమిళనాడు తరహాలో ప్రత్యేక మినహాయింపులు తీసుకుని తెలంగాణలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశాలపై కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నామని... క్రైస్తవులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూడా అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ అయ్యే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకే కేటాయిస్తామని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ క్రైస్తవ సంఘాల పెద్దలు గొల్లపల్లి జాన్, జోనాథన్ కల్వ, ఎసీ.సాల్మన్, ఇ.డి.ఎస్.రత్నం, పాల్ ఆరాధన, నెహ్రూ ధైర్యం తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... చట్టసభల్లో క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వారికి ఎమ్మెల్సీ పదవినివ్వడం ద్వారా సమస్యలను చట్టసభల్లో వివరించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పదవిని రాజకీయ కోణంలో చూడకుండా క్రైస్తవ మత పెద్దలంతా కలిసి సూచించే వ్యక్తికి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
క్రిస్మస్‌కు ప్రత్యేక కార్యక్రమం
రంజాన్ సందర్భంగా ముస్లింలకు అధికారికంగా విందు ఇచ్చినట్లుగానే.. క్రైస్తవులకు కూడా క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందని, సీఎం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చర్చిలు నిర్మించడానికి కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దేవాలయాలు, మసీదులు నిర్మించుకోడానికి ఎలాంటి నిబంధనలున్నాయో చర్చిల నిర్మాణానికీ అలాంటి నిబంధనలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
క్రైస్తవులకు ప్రత్యేకంగా శ్మశానాలు
ప్రతీ గ్రామం, పట్టణంలో క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దీనికోసం స్థల సేకరణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. చర్చిల నిర్మాణానికి, ఇతర అవసరాల కోసం నిధులు మంజూరు చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కొన్నిచోట్ల క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లపై దాడులు జరుగుతున్నాయని మత పెద్దలు సీఎం దృష్టికి తీసుకురాగా... భవిష్యత్‌లో అలా జరగకుండా పోలీస్‌శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రవేశికలో భారతదేశాన్ని లౌకికరాజ్యంగా ప్రకటించిందని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన తామంతా అందుకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖంగా ఉండాలని, కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలంటూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.