ఇంజనీరింగ్ సీట్లలో భారీ కోత! | 30 thousand seats reduced in Engineering seats | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ సీట్లలో భారీ కోత!

Published Fri, Apr 15 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

30 thousand seats reduced in Engineering seats

30 వేలకుపైగా తగ్గనున్న సీట్లు
మూసివేత కోసం దరఖాస్తు చేసిన కాలేజీలు 21
బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపునకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసినవి 41

అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేసుకోని కాలేజీలు 58
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఇప్పటికే పలు కాలేజీలు స్వచ్ఛం దంగా మూసివేతకు విజ్ఞప్తిచేసుకోగా.. మరిన్ని కాలేజీలు బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’కి దరఖాస్తు చేసుకున్నాయి. ఇక 58 కాలేజీలైతే అసలు అఫిలియేషన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మొత్తం గా వచ్చే విద్యా సంవత్సరం(2016-17)లో 30 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు రద్దయ్యే అవకాశముంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు మొత్తం భర్తీ అయ్యే అవకాశముంది. గతేడాది కంటే ఈసారి ఇంజనీరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరగడం కూడా దీనికి తోడ్పడనుంది. రాష్ట్రంలో మొత్తం 249 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. అందులో 21 కాలేజీలు మూసివే సుకుంటున్నట్లు జేఎన్‌టీయూహెచ్‌కు తెలియజేశాయి. వీటిల్లో ఒక్కో కాలేజీలో 400 నుంచి 900 వరకు సీట్లున్నాయి. సగటున 500 సీట్ల చొప్పున లెక్కించినా 10 వేలకుపైగా సీట్లు తగ్గిపోనున్నాయి.

ఇక 41 కాలేజీల యాజమాన్యాలు కొన్ని బ్రాంచీలను పూర్తిగా రద్దు చేయాలని, కొన్ని బ్రాంచీల్లోని సీట్లను తగ్గించాలని ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన వీటన్నింటిలో కలిపి మరో 10 వేలకుపైగా సీట్లు తగ్గనున్నాయి. మరోవైపు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్‌టీయూహెచ్ ప్రారంభించింది. కానీ 58 కాలేజీలు గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇందులో మూసివేతకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలుపోగా... మిగతా 37 కాలేజీల్లోని మరో 10 వే లకు పైగా సీట్లు రద్దయ్యే అవకాశముంది. అయితే ఈ 58 కాలేజీలు బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టకపోయినా... ఇప్పటికే ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసమైనా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య పేర్కొన్నారు. లేకపోతే ఆ విద్యార్థులు నష్టపోతారని, అలాంటి కాలేజీలపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.
 
ఈసారి కన్వీనర్ కోటా ఫుల్!
2016-17లో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్లు పూర్తిగా భర్తీ కానున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలోనూ చాలా వరకు సీట్లు భర్తీ అయ్యే అవకాశముంది. రాష్ట్రంలోని 249 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,23,427 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 88,527 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటాలో 37,940 సీట్లు ఉన్నాయి. గతేడాది కన్వీనర్ కోటాలో 56,017 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 30 వేల సీట్లు మిగిలిపోయాయి. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు తగ్గిపోనుండడంతో కన్వీనర్ కోటా పూర్తిగా భర్తీ కానుంది. మరోవైపు ఎంసెట్‌కు గతేడాది 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 1,43,362 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మేనేజ్‌మెంట్ కోటాలోనూ సీట్ల భర్తీ పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement