సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడేళ్లలో వివిధ వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే 351 కాలేజీలు మూత పడ్డాయి. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి వచ్చిన ఫీజు ప్రతిపాదనలతో ఈ విషయం వెల్లడైంది. వచ్చే మూడేళ్లలో ఆయా కాలేజీల్లోని వివిధ కోర్సులకు నిర్ణయించాల్సిన ఫీజుల కోసం కాలేజీ ఆదాయ, వ్యయాలు, కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇవ్వాలని టీఏఎఫ్‌ఆర్‌సీ కాలేజీల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. తాజాగా ఈ నెల 27వ తేదీ వరకు గడువును పెంచింది. అయితే ఇకపై కొత్తగా దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని, నిర్ణీత ఫీజు చెల్లించి, హార్డ్ కాపీలను అందజేయాల్సి ఉండటంతో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, గడిచిన మూడేళ్లలో వసూలు చేసిన ఫీజులకు ప్రతిపాదనలు అందజేసిన కాలేజీల సంఖ్యతో పోల్చితే 351 కాలేజీలు మూత పడినట్లుగా తెలుస్తోంది. 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో నిర్వహించే కోర్సులకు వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు కాలేజీల నుంచి అంతకుముందు మూడేళ్ల ఆదాయ వ్యయాలను, కొత్త ఫీజల ప్రతిపాదనలను 2015లో ఏఎఫ్‌ఆర్‌సీ స్వీకరించింది. వాటి ఆధారంగా ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 1,586 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఇచ్చాయి. కానీ ఈసారి 1,235 కాలేజీలు మాత్రమే ఫీజుల ప్రతిపాదనలను ఇవ్వడంతో మిగిలిన 351 కోర్సులను నిర్వహించే కాలేజీలు మూత పడినట్లుగానే అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఫీజుల నిర్ణయం కోసం ఏఎఫ్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకుంటేనే ఆ కాలేజీల్లో ఆయా కోర్సులు కొనసాగుతున్నట్లు లెక్క. లేదంటే ఆ కాలేజీలో ఆ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు.
అత్యధికంగా బీటెక్, ఎంటెక్‌లోనే..
రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కాలేజీలే ఎక్కువగా మూత పడ్డాయి. 2015–16 విద్యా సంవత్సరం వరకు 268 కాలేజీలు బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నాయి. ఆ కాలేజీలో కొత్త ఫీజుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నాయి. ఇపుడు 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల కోసం కేవలం 197 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. అంటే 71 బీటెక్ కాలేజీలు మూత పడ్డాయి. మరోవైపు ఎంటెక్‌ను నిర్వహిస్తున్న 235 కాలేజీలలో ఇపుడు 130 కాలేజీలు మాత్రమే కొత్త ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 105 కాలేజీలు మూత పడ్డాయి. అలాగే గతంలో 228 బీఈడీ కాలేజీలు ఫీజులకు దరఖాస్తు చేసుకోగా, ఇపుడు 196 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. మిగతావన్నీ మూత పడ్డట్టుగానే భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment