
359 నామినేషన్ల తిరస్కరణ
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. జిల్లావ్యాప్తంగా రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీలకు ఈనెల 10 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 4,773 దాఖలయ్యాయి. పరిశీలనలో భాగంగా వివిధ కారణాలతో 359 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 304 తిరస్కరణకు గురయ్యాయి. రామగుండం కార్పొరేషన్ నుంచి అత్యధికంగా నామినేషన్లు తిరస్కరణకు గురికావడంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు స్పందించారు.
తిరస్కరణకు గల కారణాలపై ఆరా తీశారు. కార్పొరేషన్ అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో 03, జగిత్యాలలో 38 వార్డులకు 397 నామినేషన్లకు మూడింటిని తిరస్కరించారు. సిరిసిల్లలో 33 వార్డులకు 477 నామినేషన్లకు 05, కోరుట్లలో 31వార్డులకు 385 నామినేషన్లు రాగా 6, మెట్‌పల్లిలో 24 వార్డులకు 354 నామినేషన్లు రాగా 28, నగర పంచాయతీలైన పెద్దపల్లిలో 301 నామినేషన్లకు 04, హుస్నాబాద్‌లో 220కి రెండు, జమ్మికుంటలో 292కు ఒకటి, వేములవాడలో 286కు ఒకటి, హుజూరాబాద్‌లో 282కు ఒకటి తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 18న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది.