ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల కనీస పెంపు 38 శాతం! | 38 percent increase minimum fees in Private Junior college | Sakshi
Sakshi News home page

ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల కనీస పెంపు 38 శాతం!

Published Thu, Apr 13 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల కనీస పెంపు 38 శాతం!

ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల కనీస పెంపు 38 శాతం!

సిఫారసు చేసిన ఉన్నతాధికారుల కమిటీ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 3 వేల వరకు ఉన్న ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో త్వరలో 38 శాతం నుంచి 42 శాతం వరకు వార్షిక ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల డిమాండ్‌తో ఏర్పాటైన ఈ కమిటీ యాజమాన్యాలతో చర్చించి ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రకారం కనీసంగా 38 శాతం, గరిష్టంగా 42 శాతం ఫీజులను పెంచనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

 ప్రస్తుతం ప్రథమ సంవత్సరం వార్షిక ఫీజు రూ.1760 ఉండగా, ద్వితీయ సంవత్సర ట్యూషన్‌ ఫీజు రూ. 1940గా ఉంది. అది సరిపోవడం లేదన్న యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పెంపు చర్యలు చేపట్టింది. వాస్తవానికి 1997లో జారీ చేసిన జీవో నెంబరు 102 ప్రకారం జూనియర్‌ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులపై ఏటా 10 శాతం పెంచాల్సి ఉంది. అయితే 2014–15, 2015–16, 2016–17 విద్యా సంవత్సరాల్లో అది అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ మూడేళ్లకు గాను ట్యూషన్‌ ఫీజులను 30 శాతం పెంచాలని కమిటీ ప్రతిపాదించింది.

ఆ ప్రకారం ప్రథమ సంవత్సర ఫీజు రూ. 2,360, ద్వితీయ సంవత్సర ఫీజు రూ. 2,600 కానుంది. దీనికి అదనంగా 2017–18 విద్యా సంవత్సరంలో మరో 8 శాతం నుంచి 12 శాతం ఫీజు పెంపు ఏర్పాట్లు చేస్తోంది. కమిటీ సిఫారసుల మేరకు మండల స్థాయిలోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 8 శాతం, మున్సిపాలిటీ స్థాయిల్లో 10 శాతం, కార్పొరేషన్‌ స్థాయిలో 12 శాతం అదనపు పెంపును 2017–18 విద్యా సంవత్సరంలో అమలు చేయనుంది. దీంతో ఫీజుల పెంపు రూ. 38 శాతం నుంచి 42 శాతంగా ఉండనుంది.

అదనపు భారం రూ. 26 కోట్లు
ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న 4,20,387 మంది విద్యార్థులకు ప్రస్తుత ఫీజుల ప్రకారం రూ. 77.69 కోట్లు వెచ్చిస్తుండగా, 30 శాతం పెంపుతో రూ. 104.15 కోట్లు కానుంది. అంటే అదనంగా రూ. 26.45 కోట్లు ఏటా వెచ్చించాలి. ఇక ఈ విద్యా సంవత్సరానికి చేసే పెంపు ఈ మొత్తానికి అదనం.

అడిగిన దానికి.. ప్రతిపాదిత ఫీజుకు మధ్య ఎంతో అంతరం
యాజమాన్యాలు అడిగిన ఫీజుకు, కమిటీ సిఫార్సు చేసిన ఫీజుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆర్ట్స్‌ గ్రూపులకు మండల స్థాయిలో రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంచాలని, మున్సిపాలిటీ స్థాయిలో రూ. 9 వేల నుంచి రూ. 11 వేలకు పెంచాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలోని కాలేజీల్లో ఫీజును రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి.

అలాగే సైన్స్‌ గ్రూపు ఫీజును మండల స్థాయిలో కాలేజీల్లో రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు, మున్సిపాలిటీ స్థాయిలో రూ. 15 వేల నుంచి రూ. 18 వేలకు , మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలో రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి.  అందులో సగం పెంపునకు కూడా సిఫారసు చేయకపోవడంతో యాజమాన్యాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర్వులు జారీ కాగానే వాటిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement