69 ఏళ్ల చరిత్ర @ పరకాల | 69 Years Of Experience Of parakala Municipality | Sakshi
Sakshi News home page

69 ఏళ్ల చరిత్ర @ పరకాల

Published Thu, Jan 9 2020 10:17 AM | Last Updated on Thu, Jan 9 2020 10:22 AM

69 Years Of Experience Of parakala Municipality - Sakshi

ఎందరో స్వాతంత్య్ర ఉద్యమకారులకు జీవం పోసిన పోరాటాల గడ్డ పరకాల మున్సిపాలిటీకి 69 ఏళ్ల చరిత్ర ఉంది. 1950 సంవత్సరంలో పరకాల మున్సిపాలిటీ కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతుండేది. 1965లో కరీంనగర్‌ నుంచి పూర్వపు వరంగల్‌ జిల్లాలో విలీనంతో గ్రామపంచాయతీగా మారింది. స్వాతంత్య్ర ఉద్యమకారుల చేతుల్లోనే పరకాల గ్రామపంచాయతీ పరిపాలన కొనసాగిందని చెప్పకతప్పదు. అంతేకాకుండా సర్పంచ్‌లుగా పరిపాలించిన వారిలో పలువురు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. వరంగల్‌ జిల్లాలో విలీనం చేసిన సమయంలో విస్తీర్ణం తగ్గిపోయి 15 వేల జనాభా కంటే తక్కువగా ఉండడం చేత మున్సిపాలిటీ నుంచి మేజర్‌ గ్రామపంచాయతీగా మార్చారు. అయితే, క్రమంగా జనాభా పెరుగుదలతో 2011లో నగర పంచాయతీగా, 2018 సంవత్సరంలో పరకాల శివారులోని రాజీపేట, సీతారాంపూర్‌ గ్రామాల విలీనంతో మళ్లీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయి పూర్వవైభవం సంతరించుకుంటోంది.
– పరకాల

నేడు 50 వేల జనాభా
సాక్షి వరంగల్‌ : 1969లో పరకాలలో 15వేల జనాభా ఉండేది. 2011 జనాభా లెక్కల ప్రకారం 34,318 మంది ఉన్నారు. కానీ నేడు 50 వేల వరకు జనాభా ఉంటుందని అంచనా. దీనికి తోడు ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పరకాలలో రెండు గ్రామాలు రాజీపేట, సీతారాంపూర్‌ గ్రామాల విలీనంతో వార్డుల సంఖ్య 22 వరకు పెరిగాయి. 25,255 మంది ఓటర్లలో 12,327 మంది పురుషులు, 12,928 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు 44 పోలింగ్‌ బూత్‌లు సిద్ధం చేశారు. 

పరకాలలో మళ్లీ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం
1950 సంవత్సరంలోనే మున్సిపాలిటీగా ఉన్న పరకాలకు జిల్లాల పునర్విభజనలో తీరని అన్యాయం జరిగిందని పరకాల ప్రజలు ఏడాది పాటు ఉద్యమాలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 సంత్సరంలో మళ్లీ రెవెన్యూ డివిజన్‌ను పరకాలలో ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో స్థానికుల నుంచి  సంతోషం వ్యక్తమైంది. 

వందేళ్ల తర్వాత బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన
గ్రామదేవతలు, బొడ్రాయి పునఃప్రతిష్ఠ వేడుకలు పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవతో  2017లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పరకాల పట్టణానికి చెందిన 70 వేల మంది పాలుపంచుకున్నారు.  

సర్పంచ్‌లు, చైర్మన్లు వీరే..
1950 సంవత్సరంలో మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎం.ఎన్‌.రంగాచారి ఉన్న క్రమంలో నాటి ఎమ్మెల్యే కటంగూరు కేశవరెడ్డి మధ్య ఏర్పడ్డ విభేదాలు అవిశ్వాసానికి దారితీశాయి. 1953లో అవిశ్వాసంలో ఎం.ఎన్‌.రంగాచారి ఓటమితో ఏకు మైసయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1960లో చైర్మన్‌గా నర్సింహారెడ్డి ఎన్నికయ్యాడు. 1965లో విలీనంతో గ్రామపంచాయతీ మొదటి సర్పంచ్‌గా జంగేటి ఓదెలు ఎన్నికయ్యారు. 1970, 1975 సంవత్సరాలలో వరుసగా మూడు సార్లు సర్పంచ్‌గా జంగేటి ఓదెలు విజయం సాధించారు. 1980లో జంగేటి ఓదెలుపై ఇంద్రాసేనారెడ్డి విజయం సాధించాడు. రెండోసారి కూడా 1990లో ఇంద్రాసేనారెడ్డి విజయం సాధించగా ఆయనపై అవినీతి ఆరోపణల వచ్చాయి. దీనికి తోడు 1992లో ఆయన హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఉప సర్పంచ్‌గా ఉన్న బండి అయిలు సమ్మయ్యపై జంగేటి ఓదెలు విజయం సాధించారు. దీంతో నాలుగు సార్లు, 18 ఏళ్లుగా జంగేటి ఓదేలు సర్పంచ్‌గా పరిపాలించినట్లయింది. 1995, 2000 సంవత్సరాలలో జంగేటి ఓదెలు, సంతోష్‌కుమార్‌పై మొలుగూరి భిక్షపతి విజయం సాధించారు.

ఏడాది పాటు ఎన్నికల నోటిఫికేషన్‌లో జాప్యం జరగగా 2006లో ఎస్సీ రిజర్వుడ్‌ కావడంతో మేజర్‌ పంచాయతీలో పనిచేసే బిల్‌ కలెక్టర్‌ బొచ్చు చందర్‌ తన సతీమణి బొచ్చు రూపను పోటీకి దింపి గెలిపించారు. 2010లో రూపపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై సస్పెన్షన్‌ వేటుపడింది. 2010– 2011 ఏప్రిల్‌ మాసం వరకు ఉపసర్పంచ్‌ సిరంగి సతీష్‌కుమార్‌ సర్పంచ్‌గా కొనసాగారు. 2011– 2013 సంవత్సరం వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. మేజర్‌ పంచాయతీ నగర పంచాయతీగా 2013లో అప్‌గ్రేడ్‌ కావడంతో పరకాల నగర పంచాయతీ చైర్మన్‌గా 2014 జూలై 3న మార్త రాజభద్రయ్య ఎన్నికయ్యాడు. 2018 సంవత్సరంలో సొంత పార్టీ పాలకవర్గ సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టగా అనేక హైడ్రామాలతో చోటుచేసుకున్న తర్వాత మళ్లీ రాజభద్రయ్యనే చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన హయాంలో నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది.

అభివృద్ధి చేసినందుకు  ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నాడు సర్పంచ్‌గా పోటీ చేయాలంటే అభివృద్ధి అజెండాతో వెళ్లేవాళ్లం. ప్రచారానికి వెళ్తే ప్రజలు కూడా అభివృద్ధి పనులు కోరుకునేవాళ్లు. కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్నికల్లో  డబ్బు ఆశించడం మంచి సంప్రదాయం కాదు. రెండు సార్లు సర్పంచ్‌గా ప్రజలు మెచ్చిన అభివృద్ధిచేసినందుకే నాకు ఆ తర్వాత జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చారు. 
– మొలుగూరి భిక్షపతి, పరకాల మాజీ ఎమ్మెల్యే 

► జనాభా 34,318 (2011 లెక్కల ప్రకారం)
► కుటుంబాలు 7,798
► ఓటర్లు 25,255
► పురుషులు 12,327
► మహిళలు 12,928
► బీసీలు 16,176
► ఎస్సీలు 6,556,  ఎస్టీలు 268
► ఇతరులు  2,255

► ఏటా ఆదాయం   రూ.3 కోట్లు
► వ్యయం   రూ.2.70 కోట్లు
► రోజువారీగా సేకరించే చెత్త 3 టన్నులు
► రోడ్లు  40 కిలోమీటర్లు (అంతర్గత రోడ్లు)
► స్లమ్‌ ఏరియాలు  15
► డ్రెయినేజీలు  30 కిలోమీటర్లు 
► వాటర్‌ ట్యాంకులు  7
► నల్లా కనెక్షన్లు  5వేలు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement