7న అజ్మీర్‌కు డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈ నెల 7న అజ్మీర్ వెళ్లనున్నారు. కొత్తగా ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పాటైన సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించి మొక్కుతీర్చుకుంటారు. అనంతరం రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాతో సమావేశమవుతారు.
ఈ సందర్భంగా తెలంగాణ నుంచి అజ్మీర్‌కు వచ్చే యాత్రికుల వసతి కోసం దర్గా సమీపంలో ప్రత్యేకంగా విశ్రాంతి భవనం నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయింపుకోసం చర్చిస్తారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ రాసిన లేఖను వసుంధరకు అందజేస్తారు. అదేవిధంగా రాజస్థాన్‌లో మైనార్టీ సంక్షేమం, వక్ఫ్‌బోర్డు తదితర సంస్థల పని తీరును పరిశీలిస్తారు.
అనంతరం అక్కడి నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీ ఏర్పాటు, హైదరాబాద్ పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు, త్వరగా వక్ఫ్‌బోర్డు విభజన, వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు తదితర అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. 11న ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.