111 జీవో కరెక్టే..! | 86 villages should be as bio conservation zone | Sakshi
Sakshi News home page

111 జీవో కరెక్టే..!

Published Tue, Sep 23 2014 11:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

86 villages should be  as bio conservation zone

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 111 జీవోను సవరిస్తే  జిల్లాలోని జంట జలాశయాల అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని నీటి పారుదలశాఖ తేల్చిచెప్పింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని 86 గ్రామాలను జీవ పరిరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)గా పరిగణిస్తూ 1996లో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను జారీచేసింది. జంటనగరాల దాహార్తిని తీర్చే ఈ  జలాశయాలకు వరద నీరు సులువుగా చేరాలంటే ఆంక్షలు తప్పనిసరని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది.

 ఈ క్రమంలో రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోని 86 గ్రామాలను 111 జీవో పరిధిలోకి తెచ్చింది. అయితే, తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందని, దీన్ని వెంటనే సవరించాలని చాలా ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూ క్రయ విక్రయాలు, నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ ఉత్తర్వులను సడలించాలని కోరుతున్నారు.

అయితే, జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినందున... గత  పాలకులు కూడా దీనిని సవరించే ందుకు సాహసించలేదు. ఒకవైపు బడాబాబులు, సినీరంగప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాత్రం జీవోను అదనుగా చేసుకుని అడ్డగోలుగా ల్యాండ్‌బ్యాంకును సమకూర్చుకున్నారు. కారుచౌకగా భూములు లభించడంతో రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లను నెలకొల్పుకున్నారు.
 
సవరణ కుదరదు
 111 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున... జీవో ఎత్తివేత , సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాస్త్రీయత పాటించకుండా అప్పట్లో జీవో జారీ చేశారని, దిగువ ప్రాంతాలపై కూడా అంక్షలు విధించారనే ఆరోపణలున్నందున.. అవి నిజమైతే కనీసం ఆ గ్రామాలకైనా జీవోనుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భావించారు. ఈ అంశంలో పర్యావరణ, సామాజిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యోచించారు.

 శాసనసభ సమావేశాలనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందుకున్న జిల్లా కలెక్టర్... బయో కన్జర్వేషన్ జోన్‌ను పునఃసమీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇరిగేషన్ శాఖతో ప్రత్యేక సర్వే చేయించారు. 111 జీవో వర్తింపజేస్తున్న 86 గ్రామాలు జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయని, శాస్త్రీయంగానే ఈ గ్రామాలపై ఆంక్షలు విధించారని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఏ మాత్రం అంక్షలు సడలించినా.. ఈ జలాశయాల ఉనికి దెబ్బతింటుందని తెగేసి చెప్పింది. ఈ మేరకు తమకు నివేదిక అందజేసినట్లు జిల్లా ముఖ్యఅధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement